ఆ వర్తక సంఘం స్థలం 35 మందిదే..!

నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్నూర్‌ పట్టణ కేంద్రంలో 27 సంవత్సరాల క్రితం 35 మంది కిరాణా వ్యాపారస్తులు కిరాణా సంఘం పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మంగళవారం తెరచి ఉంచిన షాపు యజమానులు సంఘంలో డబ్బులు చెల్లించి షాప్ తీసుకోవాలని, సంఘం అభివృద్ధి కోసం ప్రతి నెల చిట్టిలు వేసుకొని వచ్చిన ఆదాయంతో 2002 సంవత్సరంలో చర్చి సమీపంలో ఉన్న 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి 2008వ సంవత్సరంలో సంఘం పేరు పై రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. 20 గుంటల స్థలంలో 35 మంది సభ్యులకు తెలియకుండా సభ్యులలో కొందరు వ్యక్తులు అందరి అనుమతి తీసుకొకుండానె ఆ స్థలంపై పూర్తి హక్కు మాకే ఉంటుందని పెట్రోల్ పంపుకు లీసుకుఇచ్చారు. ఈ విషయం కాస్త మిగతా సభ్యులకు తెలియడంతో కిరాణా సంఘం పై స్థల వివాదం సంఘంలో మాటలు యుద్ధానికి దారి తీసింది. గత మంగళవారం 4వ తేది నాడు ఈ పంచాయతీ కాస్తా గ్రామపంచాయతీకి చేరడంతో 35 మంది సభ్యులు చెల్లించిన వివరాలు పూర్తి ఆధారాలతో ఈనెల 11వ తేదీ మంగళవారం నాడు గ్రామపంచాయతీకి తీసుకురావాలని పాలకవర్గం ఆదేశించినట్లు తెలిసింది. వాస్తవానికి ఒక సంఘం సభ్యులు కలిసి కొన్న స్థలం పై పూర్తి హక్కు ఆ సంఘం సభ్యులకే ఉంటుంది. ఆ స్థలాన్ని అమ్మేయాలన్నా, లీజుకు ఇవ్వాలన్న 35 మంది సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సంఘంలోని కొందరు సభ్యులు స్థలాన్ని చూపించి ప్రస్తుతం నూతన కిరాణా షాపులు ప్రారంభిస్తున్న వారి వద్ద నుండి వేల రూపాయలు వసూలు చేయడంతో స్థలంపై 35 మందికి హక్కు ఉంటుంది కానీ ఇంతమందికి ఎలా ఉంటుందని మిగతా సభ్యులు ప్రశ్నిస్తున్నారు. స్థల వివాదం రోజురోజుకు పెరిగి రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇందులో ఒక వర్గం స్థలాన్ని అమ్మేయాలని పట్టు పట్టడంతో మరో వర్గం కిరాణా షాపు తీసేసిన వారికి ఎలాంటి హక్కు ఉండదని షాపులు ఉన్నవారికి మాత్రమే హక్కు ఉంటుందని వాదిస్తున్నారు. 27 సంవత్సరాల క్రితం ఒక్కో రూపాయి పక్కకు వేసి కొనుగోలు చేసిన స్థలంపై ప్రస్తుతం ఉన్న కిరాణా వ్యాపారస్తులకు ఎలా హక్కు ఉంటుందని ఒక వర్గం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 11వ తేదీ నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థల వివాదం ఎటువైపు మలుపు తిప్పుతుందని ఇది వర్గాల సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా నలుగురు వ్యక్తులు కలిసి ఉన్న స్థలంపై పూర్తి హక్కు ఆ నలుగురు వ్యక్తులకే ఉంటుందని, వర్గాలుగా విభజించి సంఘంలోని కొందరు వ్యక్తులు స్థలంపై డబ్బులు వసూలు చేసిన డబ్బులు చెల్లించిన వారికి స్థలం పై ఎలాంటి సంబంధం ఉండదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.