సీట్ల కోసమే కవిత అరెస్టుకు ప్లాన్

– మోడీ, కేడి లు గల్లీలో కొట్టుకుంటూ ఢిల్లీలో దోస్తులు అవుతారు
– కెసిఆర్ కుటుంబాన్ని కాపాడేది మోడీనే
–  బిఆర్ఎస్ తెలంగాణలో  ఉండదు.. బిజెపికి రెండు సీట్లు కూడా రావు

 – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుతో మూడు సీట్లు గెలవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశ పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.  శనివారం ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు కవిత ఇంటి మీద ఐటీ, ఈడీ, సీబీఐ పోలీసులతో మోదీ, అమిత్ షా దాడి చేయించి అరెస్టు జేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.  ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక నేతలను అరెస్టు చేసిన సమయంలో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మోడీ, అమిత్ షా రైడ్స్, మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారని అన్నారు. మోదీ, కేడీ గల్లీలో కొట్లాడుకుంటారని ఢిల్లీలో దోస్తులవుతారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్షల కోట్లకు పడగెత్తిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారని తాము ప్రశ్నిస్తే ఇన్నాళ్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇక తెలంగాణలో ఉండదని.. బీజేపీ రెండు ఎంపీ సీట్లను కూడా రాష్ట్రంలో గెలవదని అన్నారు. నల్లధనాన్ని పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రతీ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కుల, మత ఘర్షణల పేరుతో మళ్లీ మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తమకు 14 నుంచి 15 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని.. సెక్యులర్ పార్టీనే అందరినీ సమానంగా పాలిస్తుందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూసినా.. ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.