మహిళా ఉద్యమ పునర్నిర్మాణానికి వేదిక ఖమ్మం

The platform for the reconstruction of the women's movement is Khammamఅక్టోబర్‌ 21,22,23 తేదీల్లో కొత్తగూడెం పట్టణం మహిళా సంఘం మహాసభలకు వేదిక కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది గర్వించే విషయం. ఈ సందర్భంగా ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా ఉద్యమం నుండి స్ఫూర్తి పొందుదాం…
1974లో ఖమ్మం పట్టణంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం మూడో మహాసభలు జరిగాయి. కావడానికి మూడో మహాసభలు అయినా 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి మహాసభ 74లో ఖమ్మంలో జరిగిన ఈ మహాసభ. అంతకు ముందు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు నిజాం పాలనలోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు బళ్ళారి మద్రాస్‌ ప్రెసిడెన్సీ లోనూ ఉండేవి. ఆంధ్ర రాష్ట్ర మొదటి మహాసభ 1947 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా చిలువూరులో జరిగింది. రెండవ మహాసభ 1948లో విజయవాడలో జరపాలని తలపెట్టారు. అయితే ప్రభుత్వం మహాసభను నిషేధించింది. అప్పుడే ఆంధ్ర వనిత పత్రికను ప్రచురించారు. పత్రిక కాపీలు కూడా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కృష్ణాజిల్లా అంగలూరులో రెండవ మహాసభ జరిగిందని చెబుతారు. తదనంతర కాలంలో ఆరంభం నుండి మహిళా ఉద్యమాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించింది వామ పక్ష ఉద్యమం. అయితే వామపక్ష ఉద్యమంలోనే వచ్చిన అనేక ఆటుపోట్లు కారణంగా మహిళా సంఘం కార్యక్రమాలు కూడా కుంటుపడ్డాయి.
ఉద్యమ విస్తరణ
1967లో గుంటూరు జిల్లా కాజా గ్రామంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా నాయకులు, కార్యకర్తలకు క్లాసులు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అంటే ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి మహిళా ఉద్యమాన్ని కాస్త పట్టాలెక్కించేందు 1974లో ఖమ్మం పట్టణంలో మహాసభలు జరిగాయి. మోటూరు ఉదయం కార్యదర్శిగా అంతకుముందు కార్యదర్శిగా ఉన్న మానికొండ సూర్యావతి అధ్యక్షురాలుగా, మల్లు స్వరాజ్యం, కొండపల్లి దుర్గాదేవి వంటి నేతలతో ఒక కార్యవర్గం ఏర్పడింది. అప్పటినుండి వెనుతిరిగి చూడకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మహిళా ఉద్యమం విస్తరించింది.
స్త్రీల ధైర్య సాహసాలు అనేకం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప స్థానం ఉన్నది. దొరల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగితే ఆ పోరాటంలో భాగంగా మహిళలు తుపాకీ శిక్షణ అందుకొని పురుషులతో భుజం భుజం కలిపి పోరాడారు. దొరల పెత్తనాన్ని తరిమికొట్టారు. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ప్రాంతం సింగరేణి బొగ్గు గనుల కేంద్రం. ఆ రోజుల్లో ఆడవాళ్లు కూడా గనుల్లో పనిచేసేవారు. గని కార్మికుల పోరాటాల్లోనూ, నాయకుల్ని రక్షించుకోవడంలోనూ గని కార్మిక స్త్రీల ధైర్య సాహసాలు అనేకం ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం, గిరిజనుల ఆవాసాలు ఉన్నాయి. ఇటు నైజాం సర్కారు దోపిడీకి అటు బ్రిటిష్‌ వాళ్ళ దోపిడీకి కూడా గిరిజనం అణగారిపోయారు. అటవీ హక్కుల కోసం గిరిజనులు ఎన్నో పోరాటాలు చేశారు. వాటన్నిటిలోనూ స్త్రీల పాత్ర ఉన్నది.
ప్రజలే చరిత్ర నిర్మాతలు
తమ బతుకుల బాగుకోసం ప్రజలు చేసే పోరాటాలే చరిత్ర. ఇది కమ్యూనిస్టు మేనిఫెస్టోలోని మొట్టమొదటి వాక్యంలో ఉన్న సారాంశం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఉద్యమాల్లో మహిళల పాత్ర ఓ చెరగని ముద్ర. ఎందరో నేతలు ప్రాణత్యాగాలకు కూడా వెనకాడ లేదు. భర్తను పోగొట్టుకున్న స్త్రీలు ఏడుస్తూ మూలన పడి ఉండక ఉద్యమ పతాకాలు భుజాలకు ఎత్తుకొని మోశారు. నాయకత్వం వహించారు. అటువంటి వారికి ఓ ఉదాహరణ బత్తుల హైమావతి. అంతకుముందే భద్రాచలం ప్రాంతంలో గిరిజన నేత రాజేశ్వరమ్మ, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతంలో ఏలూరు జయమ్మ, కొండపల్లి దుర్గాదేవి ఆ తర్వాత భూస్వాముల దాడులకు గురై హత్యగావించబడిన గండ్లూరి కిషన్‌ రావు భార్య నర్సుబాయమ్మ వంటి నేతలు ఆరంభంలో ఉద్యమానికి సారధ్యం వహించారు. అలాగే పాయం సీతమ్మ, పర్స భారతి మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించి నేటి నాయకత్వానికి ఆదర్శంగా నిలిచారు. వీరంతా 1974లో జరిగిన మహాసభలకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఈ మహాసభల కంటే ముందే ఇల్లెందు తాలూకాలోని బయ్యారంలో మహిళా కార్యకర్తలకు క్లాసులు జరిగాయి.
స్నేహ హస్తం అందిస్తూ…
అక్షరాస్యత ఉద్యమంలో, రిజర్వేషన్ల ఫలితంగా స్థానిక సంస్థల్లో వివిధ స్థానాల్లో ఎన్నికైన మహిళలు ఏమాత్రం వెనుకంజ వేయకుండా శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నారు. అబల అనే పదాన్ని తుడిచిపెట్టారు. రైతాంగ పోరాటాల్లో, వ్యవసాయ కార్మిక పోరాటాల్లో, సారా వ్యతిరేక ఉద్యమాల్లో వేల సంఖ్యలో మహిళలు కదిలి వచ్చారు. ఈ ఉద్యమాలు ఎందరో నేతల్ని సృష్టించాయి. ఆనాటి నుండి ఇంటా బయట సాగే హింస కారణంగా కుమిలిపోతున్న స్త్రీలకు అండగా నిలబడి నేనున్నాను అని స్నేహ హస్తం అందించి, తోటి మహిళల్ని సమీకరించి ఉద్యమాలు సాగిస్తోంది అఖిల భాతర మహిళా సంఘం.

– ఎస్‌.పుణ్యవతి, ఐద్వా జాతీయ నాయకులు