– 8 గంటలకు పైగానే శ్రమిస్తున్నరు 85 శాతం కార్మికుల పరిస్థితిది
– 21 శాతం మంది 12 గంటలకు పైగానే
– ‘జన్‌పహల్’ ఎన్జీఓ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో చాలా మంది గిగ్ వర్కర్లు 8 గంటలకు మించి పని చేస్తున్నారు. మరికొంత మంది 12 గంటలకు మించి మరీ శ్రమిస్తున్నారు. దేశవ్యాప్తంగా 32 నగరాల్లోని 5వేల మందికి పైగా కార్మికులను చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ కేంద్రంగా పని చేసే జన్‌పహల్ ఎన్జీఓ ఈ సర్వేను నిర్వహించింది. ప్రభుత్వాలకు, సంస్థలకు కొన్ని సిఫారసులనూ చేసింది.
ఈ సర్వే సమాచారం ప్రకారం.. ఇందులో 85 శాతం మంది డ్రైవర్లుగా, రైడర్లుగా రోజుకు 8 గంటలు పని చేస్తున్నారు. ఇందులో 21 శాతం మంది రోజుకు 12 గంటలకు పైగానే చెమటోడుస్తున్నారు. సర్వేలో స్పందించిన మహిళల్లో 65 శాతం మంది తాము తమ ఉద్యోగాల్లో అభద్రతతో ఉన్నామని తెలిపారు.గిగ్ కార్మికులను తక్కువ వేతనం, దోపిడీ నుంచి రక్షించటానికి కంపెనీలు న్యాయమైన, పారదర్శక చెల్లింపు నిర్మాణాలను ఏర్పాటు చేసేలా నిబంధనలను నివేదిక సిఫారసు చేసింది. ”ఈ పని శారీరకంగా తీవ్రమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్లాట్‌ఫారమ్ ‘ఓవర్‌టైమ్’ చెల్లించాలి. దానికి మించి ‘రెగ్యులర్’ గంటల సంఖ్యను నిర్దేశించాలి” అని నివేదిక పేర్కొన్నది. ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కనీస వేతన చెల్లింపు.. ఆదాయంలో స్థిరమైన అంశానికి హామీ ఇవ్వటంలో సహాయపడుతుందని వివరించింది. కార్మికుల ఐడీలను బ్లాక్ చేసే పద్ధతులను అనుమతించకూడదనీ, వారి ఐడీలను నిరవధికంగా బ్లాక్ చేయడం సాధ్యం కాదని వివరించింది.
స్పందన తెలియజేసిన 5,220 మందిలో 57 శాతం మంది రెండు నుంచి ఐదు సంవత్సరాలు డ్రైవర్లు, రైడర్లుగా, 16 శాతం మంది ఐదేండ్లకు పైగా ఉన్నారు. ”22-30 ఏండ్ల గిగ్‌వర్కర్లలో అధికం ఈ వృత్తిని తాత్కాలిక ఉద్యోగంగా భావిస్తున్నారు. 47 శాతం మంది రెండేండ్లకు పైగా గిగ్ కార్మికులుగా ఉన్నారు” అని నివేదిక పేర్కొన్నది.