ఒక కుటుంబం లోంచి అనేక మంది సాహిత్య సృజనకారులు రావడం ఒకింత ఆశ్యర్యం కలిగించే ముచ్చట. మొన్న సందర్భానుసారంగా చెప్పుకుంటూ పెద్దలు వాసాల నరసయ్యను యాది చేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే సందర్భం… పెద్ద తండ్రి అయిన వాసాల నరసయ్య స్ఫూర్తి … తండ్రి కవి, వాసాల శౌరి ప్రోత్సాహం వెరసి కవి, బాల సాహితీవేత్త, గేయకర్త, కార్యకర్త, లయనిజంలో నడిచిన సేవాదీప్తి వాసాల వెంకటేశ్వర్లు. జనవరి 26, 1971 న పుట్టిన వాసాల వెంకటేశ్వర్లు తల్లితండ్రులు శ్రీమతి వాగీశ్వరి – శ్రీ వాసాల శౌరి. వృత్తిరీత్యా తెెలుగు పండితుడు. కవిగా, రచయితగా, పరిశోధకునిగా రాణించారు.
కవిగా వెంకటేశ్వర్లు తొలి రచన బాల సాహిత్యం, కాగా ‘దాహం’ కవితా సంపుటిని ప్రచురించారు. సేవా మార్గంలో నడవాలని లయన్స్ క్లబ్‌ను ఎంచుకున్న వెంకటేశ్వర్లు కోరుట్ల లయన్స్ క్లబ్ కు కార్యదర్శిగా పనిచేశారు. ‘గాయమైన గుండెకు/ ఉపశమనాన్ని కల్గించే ప్రథమ చికిత్సని/ వసుదైక కుంటుంబంలో/ మానవతా విలువలకై తపించే ఆశాజీవిని’ అంటూ తనకు తాను నిర్వచించుకుంటారు వెంకటేశ్వర్లు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ చదివి, పిహెచ్.డి పరిశోధన కోసం నమోదు చేసుకున్నారు. హిందీ విద్వాన్, సాహిత్యరత్న, సంస్కృత పారీణ ఉపాదులు పొందారు. మెట్టుపల్లి జాతీయ సాహిత్య పరిషత్తు కార్యదర్శిగా పనిచేశారు. తన సంపాదకత్వంలో ‘సంస్కృతి సౌరభాలు’ పుస్తకాన్ని వెలువరించారు. తెలుగు, హిందీ రెండు భాషల్లో వాసాల వెంకటేశ్వర్లు రచనలు చేశారు. అన్ని తెలుగు, హిందీ దిన, వార పత్రికల్లో వీరి కవితలు, కథలు అచ్చయ్యాయి. సిద్ధిపేట గాదేపల్లి వెంకటమ్మ వీరయ్య స్మారక ‘రాష్ట్రీయ యువ సాహితీ పురస్కారం’, ప్రపంచ తెలుగు మహాసభల్లో కోరుట్ల డివిజన్ స్థాయి పురస్కారం, మాతృభాషా పరిరక్షణ సమితి ‘తెలుగు వెలుగు పురస్కారం’, విజయవాడ మానస కల్చరల్ అకాడమి ‘ఉత్తమ కవి’ పురస్కారం, ఉగాది పురస్కారం అందుకున్నారు. మెట్టుపల్లి జాతీయ సాహిత్య పరిషత్తు కార్యదర్శిగా, భారతి సాహితీ సమితి సభ్యులుగా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో నిరంతరం ముందుండే వాసాల వెంకటేశ్వర్లు తరువాత లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచినడిచారు.
వెంటేశ్వర్లు తొలి రచన ‘మమతల దీపం’ బాల గేయ సంపుటి. ఇది 2006 లో అచ్చయ్యింది. ఇందులో మాత్రా ఛందోబద్ధమైన గేయాలతో పాటు, గేయాలు, వచన కవితలు, రాగ, తాళ, లయలతో సాగే పాటలు ఉన్నాయి. ‘కులుకులమ్మ కులుకులు/ కలువపూలు కులుకులు’ వంటి గేయ పాదాలు ఈయన గేయ జ్ఞానానికి నిదర్శనాలు. తన గేయాల్లో లయలను, గతులను ఎంచుకోవడంలోనూ వెంకటేశ్వర్లు తనదైన పద్ధతిని పాటించి రచించారు. ఇందులోని అనేక గేయాలు ఖండ, మిశ్రగతుల్లో కనిపిస్తాయి. ఇంకొన్ని వచనంలో సాగినా అంత్యప్రాసలతో లయాత్మకంగా ధ్వనిస్తాయి కూడా. ‘వాణి వచ్చెను – కవిత నేర్పెను/ హృదయ వీణను – తట్టి లేపెను/ శిరసు వంచెద – భక్తి మొక్కెద/ చేరదీయుము – కరుణ జూపుము’ అంటూ ప్రార్థిస్తూ, చిన్నారి బాలల లోకాన్ని కీర్తిస్తూ ఈ బడి పంతులు ‘మమతల దీపం’ గేయంలో ‘మాటలు పాటలు/ ఐక్యత ఆటలు/ స్నేహం పంచే/ అద్భుత దీపం/ బాలల లోకం’ అని చెబుతారు. ఇంకా… ‘నవ్వుల లోకం/ పువ్వుల లోకం/ శోభలు పంచే/ అద్భుత లోకం/ మా లోకం/ బాలల లోకం’గా చెబుతారు. తల్లితండ్రులను కీర్తిసూ ‘మాతృదేవులు… తల్లుల్లారా!/ ప్రాణం పోసిన దాతలు మీరు…/ పితృదేవులు/ తండ్రుల్లారా..!/ జీవం పోసిన/ త్యాగులు మీరు’ అని రాస్తారు.
‘మాతృభాష’ గురించిన గేయంలో మాధుర్యం పంచే భాష/ సౌందర్యం పెంచే భాష/ …తేనె లొలుకు తెలుగుభాష/ అదేఅదే మాకు శ్వాస’ అని రాశారు. బడి గురించి, గుడి గురించి ‘ఇది మా బడి/ చదువుల గుడి/ ఇది మా బడి/ కన్నతల్లి ఒడి/ ఇది మా బడి తెలుగు పలుకుబడి/ ఇది మా బడి/ విజ్ఞానపు మడి/ ఇది మా బడి/ నేర్పుతుంది నడవడి’ అంటూ చక్కగా కీర్తించారు. కవిగా వెంకటేశ్వర్లుకు అనేక ఆశలు, ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని, ‘నేనొక/ హంసనైతే/ హింసను/ మాన్పిస్తా/ నేనొక/ మేఘమైతే/ చినుకురాలి/ పంటలు పండిస్తా’ అంటాడు. పిల్లలకు చిన్నప్పుడే చక్కని మార్గాలు నేర్పాలని వెంకటేశ్వర్లు భావిస్తారు. అలా ‘శరీర/ శ్రమయే/ ప్రగతికి/ మార్గం/ దానం/ ధర్మం/ ధార్మిక/ మార్గం/ ..అన్నెం/ పున్నెం/ బాలల/ మార్గం/ మంచిని/ పెంచుట/ మానవ/ మార్గం’, ‘కక్షలు శిక్షలు/ వద్దండి/ మాకవి వద్దండి/ ప్రేమలు మమతలు/ ముద్దండి/ మాకవి ముద్దండి’, ‘తెలుగు తల్లి పిల్లలం/ తేనెలొలుకు పువ్వులం/ కలువ కనుల పాపలం/ సోయగాల రూపులం’ అంటూ చక్కని తీయని గేయాలను రాసిన ఈయన ‘బుజ్జి పాప/ బుజ్జి పాప/ ఏడికెలితివి…?’ అన్న గేయంలో అలతి అలతి పదాలతో వర్ణన చేశారు. ఈ ‘మమతల దీపం’ గేయాలన్నీ బాలల ఆలోచనలకు, ఆశలకు, ఊహలకు, ఊసులకు, ఆటలకు, పాటలకు, మాటలకు, మమతలకు… వారి వారి ఆలోచనలకు అనువుగా సాగుతాయి. కవిగా, పరిశోధకునిగా, బాల సాహితీవేత్తగా ముప్పేటలకుగా పెనవేసుకున్న ప్రతిభతో ముందుకు సాగుతున్న ఈ యువకవి మిత్రుడు 2021లో యాభైయేండ్ల వయస్సులో మనకు దూరమయ్యాడు. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548