– 3 ఆటోలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం
నవతెలంగాణ-కొత్తగూడెం
వాహనాలను దొంగిలించే ముఠాను కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి మూడు ఆటోలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకున్నారు. శనివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీల నిర్వహణలో భాగంగా అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ విచారించినట్టు తెలిపారు. కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులను విచారించగా వీరు దొంగతనాలు చేస్తుంటారని తేలింది. ఈ ముఠాలో విఎం. బంజరు, పెనుబల్లికి చెందిన గోపి, శ్రీను అను వ్యక్తులు విద్యానగర్ కాలనీ, చుంచుపల్లిలో నివాసం ఉంటున్నారు. విఎం.బంజరకు చెందిన ముత్తారావు, శివరాం, కొటయ్య, గద్దల శివ, లక్మణరావులతో ముఠాగా ఏర్పడి వరుస దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలో ఇళ్ల ముందు ఉన్న ఆటోలను, బైకులను, కార్లను దొంగిలించి అమ్ముకుని వచ్చిన సొమ్మును అందరూ పంచుకునేవారని తెలిపారు. ఇలా కొత్తగూడెంకు చెందిన ఒక ఆటోను అమ్మేందుకు వచ్చి పట్టుబడినట్లు వివరించారు. వీళ్ళు అందరూ కార్లలో తిరుగుతూ దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నారని అన్నారు. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్లుకు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టుబడిన వీరివద్ద నుండి ఒక కారు, మూడు ఆటోలు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.