చోరీ కేసును ఐదు రోజుల్లో ఛేదించిన పోలీసులు

నవతెలంగాణ-సారంగాపూర్‌
బీరవెల్లిలో పట్టపగలే జరిగిన చోరీని పోలీసులు ఐదు రోజుల్లో ఛేదించారు. గురువారం డీఎస్పీ గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. బీరవెల్లి గ్రామానికి చెందిన ఒన్నే సుధాకర్‌ ఇంట్లో ఈ నెల 2న దొంగతనం జరిగింది. సుధాకర్‌ గొర్రెలు మేపడానికి వెళ్లగా భార్య లక్ష్మి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని దాదాపు 7తులాల బంగారు నగలు, రూ.1.50లక్షల నగదు దొంగతనం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిర్మల్‌ రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ రామకృష్ణ దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు ఇప్ప పరమేశ్వర్‌ స్వస్థలం బోథ్‌ మండలంలోని సాయినగర్‌ కాలనీ. గతంలో ఆదిలాబాద్‌లో చోరీలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. కొంత కాలంగా బీరవెల్లిలో తల్లి దగ్గర ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణతో పాటు తన జల్సాల కోసం డబ్బులు సరిపోక దొంగతనానికి పాల్పడ్డాడు. కూలి పని చేస్తున ఇంటి వెనుకల గల ఇంటి యజమాని ఒన్నే సుధాకర్‌ కుటుంబ సభ్యులు ఉదయం వెళ్లి సాయంత్రం రావడం గమనించాడు. అతని ఇంట్లో దొంగతనానికి పథకం వేశాడు. ఈ నెల 2న మధ్యాహ్నం రాయితో ఇంటి తాళం పగులగొట్టి బీరువాపై తాళం చెవి దొరకడంతో తెరిచి అందులో దాదాపు 7తులాల బంగారు నగలు, రూ.1.50లక్షల నగదు దొంగతనం చేసి ఆదిలాబాద్‌కు పారిపోయాడు. గురువారం ఆదిలాబాద్‌ నుండి తిరిగొచ్చి బీరవెల్లి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుండి బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో డీఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించిన నిర్మల్‌ రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ రామకృష్ణ, ఎస్సై శ్రీకాంత్‌, పోలీస్‌ సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, విజరువర్మ, రాజుగౌడ్‌, వినోద్‌, మనోజ్‌ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.