– వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
– గుర్లలో డయేరియా బాధితులకు పరామర్శ
– మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం
విజయనగరం: టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలపైనా, అపరిష్కృతంగా పేరుకుపోతున్న సమస్యలపైనా ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగునా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అటువంటి రాజకీయాలను ఆపి డయేరియా బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వైసిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్, సర్వే, పశు సంవర్థకశాఖ, విలేజ్ క్లినిక్‌లలో వైద్యులు, ఎఎన్‌ఎంలు, గ్రామాల్లో ఆశా వర్కర్లు ఎంతో సమన్వయంతో పని చేసేవారని తెలిపారు. నేడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.