– 251 మీటర్ల భారీ రామ విగ్రహం ఏమైంది?
– సాధువులు, సంతుల విగ్రహాలకూ దిక్కు లేదు
– దుమ్మూ ధూళిలో పడివున్న వాజ్‌పేయి విగ్రహం
లక్నో : బీజేపీ మందిర రాజకీయాలు అందరికీ తెలిసినవే. అయితే కొందరికి మాత్రమే తెలిసిన విషయం ఒకటుంది. 2017 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో అవన్నీ మరుగున పడ్డాయి.
పర్యాటక అభివృద్ధి కోసం ‘నవ్య అయోధ్య’ పథకంలో భాగంగా సరయూ నది ఒడ్డున రాముని భారీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనిపై మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి కూడా. 2018 నవంబర్ 24న విగ్రహ నమూనా ఖరారైంది. దానిని ప్రదర్శించడం కూడా జరిగింది. ప్రపంచంలోనే అతి పొదవైన 251 మీటర్ల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఒక గొడుగును కూడా అమరుస్తారని వార్తలు వచ్చాయి. గుజరాత్‌లోని సర్దార్ వల్లభారు పటేల్, చైనాలోని గౌతమ బుద్ధుడి విగ్రహాల కంటే కూడా ఇది పొడవైనదని ప్రచారం జరిగింది. విగ్రహం అడుగున ఓ పెద్ద మ్యూజియంను ఏర్పాటు చేస్తారని, అనేక పర్యాటక కేంద్రాలతో దీనిని అనుసంధానం చేసి ప్రజలు సులభంగా చేరుకునేలా చర్యలు చేపడతారని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ఖజానా నుండి రూ.250 కోట్లు ఖర్చు చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదంతా న్యాయస్థానంలో అయోధ్య వివాదం నడుస్తున్న సమయంలో జరిగిన పరిణామం. రామ మందిర నిర్మాణాన్ని కోరుకుంటున్న బీజేపీ కార్యకర్తల దృష్టిని మరలించడానికే ఈ ప్రాజెక్టును తెర పైకి తెచ్చారని వార్తలు వచ్చాయి.
సాధువులను సంతృప్తి పరచేందుకే…
మందిర నిర్మాణం మినహా తమకేదీ సమ్మతం కాదని, కేవలం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సరిపోదని సాధువులు, మహంతులు తెగేసి చెప్పినప్పటికీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం తాను విగ్రహ ఏర్పాటు విషయంలో ఎంతో చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పుకుంది. అయోధ్య వివాదాన్ని 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత కూడా ప్రభుత్వం ఇదే మాట చెబుతూ వచ్చింది. మీడియా కూడా దీనికి వంత పాడింది. విగ్రహం పూర్తి స్వదేశీదని, దీనిని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత శిల్పి రామ్ సుతార్ నిర్మిస్తారని మీడియా కథనాలు ప్రచురించింది. విగ్రహ ఏర్పాటుకు తొలుత ఎంపిక చేసుకున్న ప్రదేశంపై స్థానికుల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. మరో గ్రామాన్ని ఎంపిక చేసినా అక్కడా నిరసనలు, అభ్యంతరాలు, ఆరోపణలు తప్పలేదు.
అటకెక్కిన ప్రయత్నాలు
అయోధ్యలో రామమందిర నిర్మానానికి వేగంగా అడుగులు పడిన నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు యత్నాలు అటకెక్కాయి. అసలు విగ్రహ ఏర్పాటు గురించి ఇప్పుడు చర్చే జరగడం లేదు. విగ్రహం కోసం చేపట్టిన భూసేకరణపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ పరిస్థితి ఏమిటో కూడా తెలియడం లేదు. అయోధ్యలో పర్యటించిన ఏ సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఈ విగ్రహం గురించి పెదవి విప్పలేదు. ఒకప్పుడు దీనిపై నిరంతరం సమీక్షలు జరిగేవి. పురోగతిపై ఎప్పటికప్పుడు చర్చించే వారు. రామ మందిరమే నిర్మితమైన తర్వాత విగ్రహం అవసరమేముందని కొందరు వాదిస్తున్నారు. 2019 జూన్‌లో అయోధ్య పరిశోధనా కేంద్రంలో ఆదిత్యనాథ్ శ్రీరాముని చిన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మమ అనిపించారు. మందిర నిర్మాణం జరిగినా విగ్రహ ఏర్పాటు యధావిధిగా జరుగుతుందని మీడియా ఊదరకొట్టినప్పటికీ దానిపై ఇప్పుడు సమాచారమిచ్చే నాథుడే లేదు.
వాటి మాటేమిటి?
విగ్రహాల రాజకీయం గత సంవత్సరం మరోసారి ఊపందుకుంది. 2022 సెప్టెంబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. రామ మందిర ఉద్యమంతో సంబంధం ఉన్న సాధువులు, ప్రముఖులు, హీరోల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన రామానంది తెగకు చెందిన సాధువులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిందేనని నిపుణులు తేల్చేశారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చౌక్ పేరును రామానంది తెగకు చెందిన జగద్గురు రామానందాచార్య పేరిట మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అక్కడ ఆమె పేరిట సైన్‌బోర్డును కూడా ఏర్పాటు చేయనివ్వబోమని హెచ్చరించారు. వీరిని సంతృప్తి పరిచేందుకు ఆదిత్యనాథ్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.
వాజ్‌పేయికే దిక్కు లేదు
అసలు సాధువులు, సంతులు, హీరోలకు ఆదిత్యనాథ్ ఇచ్చిన నిర్వచనమే సంకుచితంగా ఉన్నదని ఫిర్యాదులు వచ్చాయి. అయోధ్యలో ప్రభుత్వ సవతి తల్లి వైఖరికి సాక్షాత్తూ మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి విగ్రహమే బలి అయిందంటే ఇక ఇతరుల సంగతి చెప్పేదేముంది? అయోధ్య జిల్లా పంచాయతీ కాంప్లెక్స్‌లో వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే అది ఇప్పుడు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడి ఉంది. అయోధ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.32 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పాలనలో ఉన్న జిల్లా పంచాయతీలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించే నాథుడే కరువయ్యాడు. ఆయన విగ్రహం గత రెండు సంవత్సరాలుగా అతీగతీ లేక పడి ఉంది.