కాంగ్రెస్‌ పాలనలో రైతులది దీనస్థితి

 ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ ఫార్మర్లతో రైతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని భాషాయిగూడెం, తిమ్మాయిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సర్పంచ్‌ ఏల లతాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటయ్యాకే రైతులకు 24 గంటలు కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని, సీఎం కేసీఆర్‌ రైతుకు విలువ పెంచారని తెలిపారు. సంక్షేమంలో, అభివృద్ధిలో సిద్ధిపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో చేతికొచ్చే పంట నష్టపోతున్నదని, వానాకాలం పంట నెల ముందుకు జరపాలని రైతులకు సూచించారు. ఇక్కడ పండించిన వడ్లను ఐదు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. యాసంగిలో వరికి తెగులు వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా రసాయనిక ఎరువులు తగ్గించి పంట మార్పిడి చేస్తే ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌ రెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫామ్‌ సొసైటీ ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రాగుల సారయ్య, సొసైటీ చైర్మెన్లు ఎల్లంకి మహిపాల్‌ రెడ్డి, కోల రమేష్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్‌, బీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గోవిందారం రవి పాల్గొన్నారు.