హైడ్రాతో పేద ప్రజల గూడు గల్లంత్తు

The poor people's nest was destroyed by the hydraనవతెలంగాణరాయపర్తి
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ గూడు లేకుండా చేయడం హేయమైన చర్య అని ఎంసీపీఐ (యూ) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గుగులోత్ అరుణ్ నాయక్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉండి నిర్మాణాలు చేపట్టి, ఇంటి పన్ను, విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నటువంటి గృహ యజమానులకు ఎలాటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చడం సరికాదు అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భూములను కొనుగోలు చేసి అధికారుల అనుమతి తీసుకొని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తూ పేద ప్రజలకు గూడు లేకుండా చేయడం హేయమైన చర్య అన్నారు. నివాసముంటున్న ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ హైడ్రా అంటూ పేద ప్రజల ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు అని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్న నిరుపేద ఇళ్లను కూల్చడమే నా ప్రజాపాలన అంటే అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రాలో ఇల్లు కోల్పోయిన పేద ప్రజలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాయిత వెంకన్న, బుర్కా యాకయ్య, గుగులోత్ దేవుల, గుగులోత్ బాలు, మాన్సింగ్, కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.