– ఆనాటి ఫలితమే ప్రయివేటీకరణకు పాలకుల వెనకడుగు
– కేంద్రంలో బీజేపీ దుర్మార్గ పాలన
– దానికి బీఆర్‌ఎస్, వైసీపీ వంతపాడితే ప్రజలకు ద్రోహమే
– విద్యుత్ సవరణ బిల్లుతో ప్రజలపై భారాలు: విద్యుత్ అమరవీరుల సంస్మరణసభలో వామపక్ష నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నాటి విద్యుత్ పోరాటం చారిత్రాత్మకమైంది. ఆ ఉద్యమం ఫలితంగానే ఇన్నాళ్లూ కరెంటు చార్టీలు పెంచేందుకు పాలకులు ధైర్యం చేయలేక పోతున్నారు. సంస్కరణల పేరుతో విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తే నాటి పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం’ అని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో విద్యుత్ అమరుల స్థూపం వద్ద సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సీపీిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఎం హన్మేష్, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు కె మురహరి, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వి ప్రసాద్,ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ జానకిరాములు తదితరులు విద్యుత్ పోరాట యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ ”సరళీకరణ విధానాల్లో భాగంగా, నాటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు భారీగా పెంచింది. ప్రయివేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా తమ విధానాలను రూపొందించిం ది. అవి అన్ని తరగతుల ప్రజలకు తీవ్ర నష్టం తీసుకొస్తాయని ప్రజలు గ్రహించారు. తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ పోరాటంపై ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. 2000 సంవత్సరం ఆగష్టు 28న నిర్వహించిన ప్రజా ప్రదర్శనపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరి పారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంస్కర ణల పేరుతో ప్రజలపై భారాలు మోపితే ఖబడ్దార్ అంటూ సాగిన ఆ పోరాటం అంతర్జాతీయంగానే ప్రఖ్యాతిగాంచింది” అని రాఘవులు చెప్పారు. ఆ పోరాటం ఫలితంగానే పాతికేండ్లుగా విద్యుత్ చార్జీలు పెంచటంగానీ, ఆ సంస్థల ప్రయివేటీకర ణకు పాలకులు ధైర్యం చేయలేక పోతున్నారని తెలిపారు. ఇది కమ్యూనిస్టు పార్టీల పోరాట విజయ మని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సవరణ బిల్లుతో తిరిగి ప్రమాదం ముంచుకొస్తోందని చెప్పారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కొన్నాళ్లు బీజేపీ విధానాలను వ్యతి రేకించారు, ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. బీజేపీ విధానాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి తీసుకో వటానికి కారణమేంటో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఅర్‌ఎస్ పార్టీని అమిత్ షా ఘాటుగా విమర్శిస్తున్నా.. టూజీ, నాజీలంటూ ఒకరినొకరు ఎత్తిపొడుసుకుంటున్నా, బీజేపీ నిర్ణ యాలపై బీఆర్‌ఎస్ స్పష్టమైన ప్రకటన చేయడం లేదని చెప్పారు. బీజేపీతో దోబూచలా డుతున్న బీఆర్‌ఎస్, వైసీపీల వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడాల్సిన ప్రభుత్వాలు బీజేపీకి వంత పాడే పార్టీలుగా మారకూడదని హితవు పలికారు. బీజేపీ ని ఓడించడానికి ఇండియా కూటమితో వెళ్ళడం కేసీఆర్‌కు నచ్చడం లేదని చెప్పారు. అందుకే వామపక్షాలతో పొత్తు వద్ధనుకున్నారా? వామపక్షా లతో సానుకూలంగా ఉంటే బీజేపీకి కోపం వస్తోందనీ తెగదెంపులు చేసుకున్నారా..? దీనికి కేసీఆరే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు, సీపీఐ(ఎం)కు చాలా విషయాల్లో వైరుధ్యాలున్నా.. బీజేపీని ఓడించడమే కర్తవ్యంగా పెట్టుకున్నామ న్నారు. బీజేపీ బలపడే విధంగా వామపక్షాల పొత్తులుండవని స్పష్టం చేశారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం మహత్తరమైందన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. వామపక్షాల నేతృత్వంలో ఆనాడు జరిగిన విద్యుత్ ఉద్యమానికి విస్తృత ప్రజా మద్దతు లభించిందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉదృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టు బడిదారీ విధానాలను అమలు చేస్తూ, విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తీసుకువచ్చిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్‌లను బిగించిందనీ, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమం మొదలైతే మోడీ ప్రభుత్వం తట్టుకోవడం కష్టమన్నారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేసారు. సీపీఐ (ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్, ఆర్ శ్రీరాంనాయక్, బి ప్రసాద్, ఎంవీ రమణ, టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య సీపీఐ సీనియర్ నాయకురాలు పి. ప్రేమపావని,ప్రజాపంథా నాయ కులు ఎస్‌ఎల్ పద్మ, ఎన్డీ నాయకులు వి సంధ్య, ఎం శ్రీనివాస్, ఎంసీపీఐ(యూ) నాయకులు వనం సుధాకర్ పాల్గొన్నారు.