రాష్ట్రపతి నిలయం..జ్ఞాన సముపార్జనం

– ప్రకృతి రమణీయంతో మానసికోల్లాసం
– ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతి
– సీనియర్‌ సిటిజన్లు, పిల్లలకు అందుబాటులో ఈ-కార్ట్‌ వాహనం
– టికెట్‌ ధర రూ.50 మాత్రమే : రాష్ట్రపతి భవన్‌ పీఆర్వో కుమార్‌ సమ్రేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం జ్ఞాన సమపార్జన కేంద్రం అని రాష్ట్రపతి భవన్‌(న్యూఢిల్లీ) పీఆర్వో కుమార్‌ సమ్రేశ్‌ అన్నారు. ఎటు చూసినా పచ్చదనం, ప్రకృతి రమణీయతను అస్వాదిస్తూ మానసికోల్లాసం పొందొచ్చునని చెప్పారు. గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్‌ కె.రజిని ప్రియ, ముఖ్య అధికారి చంద్రశేఖర్‌ నాయుడుతో కలిసి మాట్లాడారు. రాష్ట్రపతి నిలయం చరిత్రను, అందులోని గార్డెన్ల విశిష్టతను, నాల్డెజ్‌ గ్యాలరీ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్రపతి విడిది, ప్రతి సోమవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ సందర్శకులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీక్షించే అవకాశాన్ని ఇప్పటికే కల్పిస్తున్నామన్నారు. సీనియర్‌ సిటిజన్లు, చిన్న పిల్లలకు నిలయంలో సందర్శించేందుకు ఈకార్ట్‌ వాహనాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. నిలయంలోని విశిష్టతలను వివరించేందుకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉండి ప్రత్యేక శిక్షణ పొందిన 20 మంది గైడ్లను నియమించామని తెలిపారు. కిచెన్‌ నుంచి డైనింగ్‌ హాల్‌ వరకు ఉన్న టన్నెల్‌ను గ్రామీణ జీవనం ఉట్టిపడేలా, బాగా చదువుకుని మహిళలు ఎదుగుతున్న క్రమాన్ని వివరించే చేర్యాల ఆర్ట్‌ ద్వారా ఆకట్టుకునేలా బొమ్మలను గీయించామన్నారు. ప్లాగ్‌ పోస్ట్‌పాయింట్‌, జైహింద్‌ ర్యాంపు, నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తూ సైన్యం-నిజాం పాలకుల మధ్య జరిగిన ఒప్పందపత్రాలు అందజేసిన ప్రాంతాలను ప్రతి ఒక్కరూ చూసి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవాలన్నారు. నాల్డెజ్‌ సెంటర్‌ను పునరుద్ధరించామనీ, అందులో రాష్ట్రపతులకు ఆయా దేశాల నేతలు ఇచ్చిన గిఫ్టులు, చేతిరాతతో రాసిన రాజ్యాంగ ప్రతి, దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల నమూనాలు, రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, బుల్లెట్‌ ఫ్రూప్‌ కారులను అందులో పొందుపర్చామని చెప్పారు. స్వాతంత్య్రం కోసం తెలంగాణలో జరిగిన పోరాటం, రైతాంగ పోరాట వీరుల ఫొటోలను అందులో ఉంచామని తెలిపారు. రాక్‌, హెర్బల్‌, బట్టర్‌ఫ్లై, నక్షత్రాల గార్డెన్‌ల గురించి, అందులో ఉన్న చెట్ల ప్రాముఖ్యత గురించి వివరించారు. మాజీ గార్డెన్‌, చిల్డ్రన్‌ పార్కులను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 22 నుంచి సందర్శకులకు అన్ని రోజులూ అందుబాటులో ఉండేలా వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునేవారు ష్ట్ర్‌్‌జూ:// ఙఱరఱ్‌.తీaరష్ట్ర్‌తీaజూa్‌ఱbష్ట్రaఙaఅ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలనీ, డైరెక్టుగా కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. స్వదేశీ సందర్శకులకు రూ.50, విదేశీ సందర్శకులకు రూ.250 టిక్కెట్‌ ధర ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు స్కూల్‌ తరఫున బుక్‌ చేసుకుంటే ఉచిత సందర్శనకు అవకాశం కల్పిస్తామన్నారు. గ్రూపుగా 30 మంది సందర్శనకు వస్తే టికెట్‌ ధరపై 20 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. రాష్ట్రపతి నిలయంలో ఆయా ప్రదేశాల గురించి వివరించేందుకు గైడ్లను నియమించామనీ, ఫ్రీ పార్కింగ్‌, వృద్ధుల కోసం వీల్‌చైర్లు, రెస్ట్‌రూమ్‌, ఫస్ట్‌ఎయిడ్‌, క్యూరియోషాప్‌, తదితర సౌకర్యాలను కల్పించామని తెలిపారు. రాష్ట్రపతి నిలయంలోని ముఖ్యమైన ప్రాంతాలను మీడియా ప్రతినిధులకు చూపెట్టి వివరించారు.