– ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన
– ప్రధాన గేటు ఎదుట బైటాయింపు
– నిలిచిన కొనుగోళ్లు..వ్యాపారుల తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కార్పొరేషన్
ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారులు వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా జెండా పాటకు భిన్నంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. జెండాపాటకు అనుగుణంగా ఒకటి, రెండు లాట్లు రేటు పెట్టాక.. మిగిలిన సరుకునంతా నాణ్యత, ఎగుమతులు లేకపోవడం, డిమాండ్‌కు మించి సరుకు రావడం, ఇతరత్ర కారణాలు చూపుతూ క్వింటాకు రూ.4వేలకు పైగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. జెండాపాటలో నలుగురైదుగురు వ్యాపారులే పాల్గొని ధర నిర్ణయించడం గమనార్హం. దీనిపై రైతులు పలుమార్లు మార్కెట్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ వ్యాపారులు అదే రీతిన వెళ్తుండటంతో శుక్రవారం మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
మంత్రి, కలెక్టర్ చెప్పినా తీరు మారట్లే..!
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజుల కిందట మార్కెట్‌ను సందర్శించారు. ఆ సమయంలోనూ వ్యాపారులపై రైతులు ఏకరువు పెట్టుకున్నారు. రెండు, మూడ్రోజుల కిందట జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కూడా మార్కెట్‌కు వచ్చారు. ధర విషయంలో వ్యాపారులను హెచ్చరించారు. జెండా పాటకు భిన్నంగా ధర పెడితే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. అయినా వ్యాపారుల వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. శుక్రవారం రైతులు ఆందోళన చేయడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ మార్కెట్‌ను సందర్శిం చారు. రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్లో కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లు నిలిచిపోయాయి. వ్యాపారులతో అదనపు కలెక్టర్, మార్కెట్‌శాఖ అధికారులు చర్చలు జరిపారు.
నిత్యకృత్యం..
మిర్చి కొనుగోళ్లు ముమ్మరమైనప్పటి నుంచి జెండా పాటకు విరుద్ధంగా ధర చెల్లిస్తున్నారు. శుక్రవారం జెండా పాట క్వింటాకు రూ.20,800 ప్రకటించగా.. వ్యాపారులు రూ.16వేల నుంచి రూ.14వేల మధ్యనే కొనుగోలు చేయడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ముఖ్యంగా పది వేలకు పైగా బస్తాల సరుకు వచ్చిన సందర్భంలో రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం 16,215 బస్తాలు మార్కెట్‌కు రాగా, గరిష్ట ధర రూ.20,800, కనిష్టం రూ.14,000, మోడల్ ధర రూ.19,000 నిర్ధారించారు. కానీ అధిక మొత్తం సరుకును సగటున రూ.15వేలకే కొనుగోలు చేశారని రైతులంటున్నారు. వ్యాపారులతో అదనపు కలెక్టర్ చర్చల అనంతరం ఇక మీదట సరైన ధర చెల్లించేందుకు వ్యాపారులు ఒప్పుకున్నట్టు చెప్పారు. అధికారులు దగ్గరుండి గిట్టుబాటు ధర పెట్టేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
జెండా పాట రేటు పెట్టాలి
రాందాసునాయక్, అందనాలపాడు, సీరోలు, మహబూబాబాద్ జిల్లా
ఎన్నో ఏండ్ల నుంచి మిర్చి తోట వేస్తున్నా.. ఈ ఏడాది తెగుళ్లతో సగం తోట చచ్చిపోయింది. మొత్తం రూ.8లక్షల పెట్టుబడి పెడితే 20 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తం సరుకు పది క్వింటాలైనా ఇక్కడున్న రేటు ప్రకారం నాకు వచ్చేది రూ.1.50 లక్షలే. జెండా పాట ఎంత పాడితే అంత ధర మాకు చెల్లిస్తే కొద్దోగొప్పైనా న్యాయం జరుగుతుంది.