నిరుపేద భారతి – ప్రధాని ఊకదంపుడు

అన్నిటికంటే పెద్ద సమస్య పేదరికమే. పేదలు ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగానే ఉంటారు. అత్యాశలకు పోలేరు. వారికి కనీస అవసరాలు తీరితే చాలు.పేదరికాన్ని నిర్మూలించాలన్న రాజకీయ దృఢ సంకల్పం లేని నేతలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. వారి జీవన శైలి కూడా తదనుగుణంగానే అసంబద్దంగా ఉంటుంది. పేదల గుడిసెల్లోకి వెళ్లి ఫొటోసెషన్లు పెట్టుకుని సంబరపడే కొందరు నాయకులు అదే పేదల గురించి పార్లమెంటులో మాట్లాడుతున్న ప్పుడు బోర్‌గా ఫీలవడం ఆశ్చర్యం గొల్పుతున్నదని ప్రధాని మోడీ విపక్షాలను ఉద్దేశించి విమర్శించారు. ”గరీబీ హటావో” నినాదం ఐదు దశాబ్దాలుగా విన్పించినా ఫలితం శూన్యం. తాము అధికారంలోకి వచ్చి పదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేసినట్ట ఆయన చెప్పుకున్నారు. గరీబీ హటావో (పేదరికాన్ని తొలగిద్దాం) నినాదం ఇచ్చింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అన్న విషయం అందరికీ తెలిసిందే.
అక్కడితో మోడీ ఆగలేదు. ‘మేం స్వయంగా పేదరికం అనుభవించా.ం పేదల కష్టాలేమిటో మాకు తెలుసు. నిరుపేదల అగచాట్లు, సామాన్య ప్రజల ఈతిబాధలు అర్థం చేసుకోవాలంటే స్పందించే హృదయం ఉండాలని అన్నారు. ”కొందరు నేతల మాదిరి మేం జనం సొమ్ముతో అద్దాల మేడలు కట్టుకోలేదని ఖరీదైన షవర్లు, వేడినీటి కొల నులు ఏర్పాటుచేసుకోలేదని” ఎద్దేవా చేశారు. ప్రధాని మాటలకు తగిన విధంగా పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలి నిజాయితీగా, పారదర్శకంగా ఉంటే ఎంత బావుండును అని ఎవరికైనా అనిపిస్తుంది. అదే విషయాన్ని ఆయన కూడా సెలవివ్వడం గొప్ప విశేషం!”పేదల సంక్షేమం గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారి మాటలకు చేతలకు ఎంతో తేడా ఉన్నది. భూమ్యాకాశాలకు చీకటి వెలుగులకు ఉన్నంత తేడా?” అని అన్నారు. పార్లమెంటులో ప్రధాని చేసిన ఈ ప్రసంగంలోని మాటలు విపక్షాలకే కాక తనకూ తమ పార్టీ బీజేపీ వారికి, వారిని బలపరిచే పార్టీల వారికీ తగలక మానవు. ప్రజలు అత అజ్ఞానంలో లేరు మరి!
ప్రస్తుత లోక్‌సభలో 93శాతం మంది ఎంపీలు కోటీశ్వరులే. అసలు కోటీశ్వరులు కానివారు పార్లమెంటుకు రావడం అసాధ్యం అని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ తెలిపింది. రాజ్యసభలో అయితే సగటు సభ్యుని ఆస్తి విలువ రూ.87 కోట్లకు పైగా ఉందట. పట్టణంలో నివసించే సగటు మనిషి ఆస్తి విలువ కంటే పార్లమెంటులోని సగటు సభ్యుని ఆస్తివిలువ 27 రెట్లు ఎక్కువ అని ఆ అధ్యయనం తెలిపింది.మన ప్రజాస్వామ్యంలో ఆర్థిక వ్యత్యాసం చట్టసభల ద్వారా ఇంత స్పష్టంగా కనపడుతున్నపుడు పేదరిక నిర్మూలనా పథకాలు, విధానాలు నిత్యం ప్రశ్నార్థకంగానే మారతాయి. బడ్జెట్‌ సందర్భంగానూ, ఆ తర్వాత, కార్పొరేట్‌ కోటీశ్వరులకు కల్పించే వేల కోట్ల రాయితీలు, రుణమాఫీలు, రుణాలు, ప్యాకేజీలు అన్నీ నల్లధనం గుట్టలుగా పేరుకుపోవడానికి తోడ్పడు తున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే.అక్రమ సంపాదనగా డబ్బు పేరుకుపోవడం, ఆ డబ్బుతో చట్టసభలు ఏర్పాటుకావడం, మరల ఆ పాలక విధానంతోనే కోట్లకు పడగెత్తేలా బాటలు పరవడం – ఇదో పెట్టుబడిదారీ విషవలయం- అందుకే దీన్ని పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మార్క్సిస్టులు పేర్కొంటారు.
”ప్రభుత్వం అనేది ఆస్తి రక్షణ కోసం స్థాపించబడింది. బీదల నుండి ధనికుల్ని, లేనివారి నుండి కలవారిని రక్షించుట కొరకే ఏర్పడింది’ అని ప్రముఖ ఆర్థిక వేత్త ఆడం స్మిత్‌ తన వెల్తు ఆఫ్‌ నేషన్స్‌ గ్రంథంలో ఇలానే తెలిపాడు. ఇదంతా నాణానికి ఒకవైపే.. మరోవైపు పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకుపైగా జనాభాఉంటే దాదాపు పదిశాతం ప్రజానీకం అంటే 80కోట్ల మంది భయంకరమైన పేదరికంలో మగ్గుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అందులో సగం మందిఅంటే 40 కోట్ల మంది మన భారతదేశంలోనే ఉన్నారు. మనం జనాభాలోనే కాదు, అత్యంత ఎక్కువ పేదలు గల పెద్ద దేశంగా మన భారతదేశం నమోదైంది.ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం మన దేశంలో ఒక శాతం కోటీశ్వరుల చేతుల్లో 73 శాతం దేశ సంపద ఉంటే 50 శాతం జనాభా (70 కోట్లు) చేతిలో కేవలం ఒక శాతం సంపద మాత్రమే ఉన్నది. టెండూల్కర్‌ నివేదిక ప్రకారం సగటున ఓ వ్యక్తి రూ.1,622లు కంటే తక్కువ ఖర్చుతో జీవిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువుగా ఉన్నవారిగా పరిగణించవచ్చని తెలిపింది.
ఈ కటిక దారిద్య్రంలోని పేదలను మనం చూడాలంటే పట్టణాల్లో నివేసించే అడ్డాకూలీల్లోను, మురికి వాడల్లోని వలస కార్మికుల్లోను చూడవచ్చు. కనీస అవరాలు తీరక మారుమూల పల్లెల్లోను, కొండాకోనల్లో బతికే ఆదివాసుల్లోనూ చూడవచ్చు. రైళ్లల్లో అనారక్షిత బోగీల్లో కిక్కిరిసిన ప్రయాణికుల్లో చూడవచ్చు. అలాగే అనాథలైన బాలలు చెత్తకుండీల్లో పారేసిన ఎంగిలాకుల కోసం కుక్కలతో కొట్లాడుకునే దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇదెంత అవమానకరం? పార్లమెంటులోని నేతలకే కాదు, సగటు భారతీయులకు కూడా! ఈ పేదరికం తొలగించడానికి నిర్దిష్ట ప్రణాళికలు రూపకల్పనలు చేసి అమలుపరచకుండా ఎవరెంత గంభీరంగా మాట్లాడినా..అవి ఊక దంపుడుగానే ఉంటాయి.
– కె. శాంతారావు,
9959745723