– స్పిన్‌ను ఆడలేకపోతున్న మన బ్యాటర్లు
– గణనీయంగా తగ్గిన పరుగుల వేట
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌పై కన్నేసిన టీమ్ ఇండియా.. స్వదేశంలో ఐదు టెస్టుల్లో విజయం సాధించటంపై దృష్టి సారించింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేయటంపై కన్నేసిన రోహిత్ సేనకు సొంతగడ్డపై పరుగుల వేట ప్రధాన సమస్యగా తయారైంది!. గత కొన్నేండ్లుగా స్వదేశంలో మన బ్యాటర్లు ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. కీలక టెస్టు సిరీస్‌ల ముంగిట భారత్ ఈ సవాల్‌ను అధిగమించేనా?!.
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచ క్రికెట్ అగ్రజట్టు భారత్. బలమైన టీమ్ ఇండియాను స్వదేశంలో ఎదుర్కొవటం ఏ జట్టుకు అయినా శక్తికి మించిన పనే. భారత్‌పై స్వదేశంలో టెస్టు సిరీస్ విజయం ఇతర అగ్రజట్లకు సైతం అందని ద్రాక్షగానే మిగిలింది. 2013 టెస్టు సీజన్ ఆరంభం నుంచి స్వదేశంలో భారత్ గెలుపోటముల రికార్డు 40-4. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (41-7) ఉంది. కానీ గత ఐదేండ్లుగా భారత క్రికెట్‌లో బ్యాటింగ్ గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పదేండ్ల రికార్డు పరిశీలిస్తే.. చివరి ఐదేండ్లలో భారత బ్యాటర్ల పరుగుల వేట గణనీయంగా పడిపోయింది. 2013-2020 వరకు భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు సాధిస్తే.. 2021 నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. జట్టులో మేటి బ్యాటర్లు ఉన్నప్పటికీ టీమ్ ఇండియా పరుగుల వేట బాగా తగ్గిపోయింది. 2013-2020 వరకు భారత్ స్వదేశంలో 28 టెస్టుల్లో విజయాలు సాధించి, ఓ టెస్టులో ఓటమి చెందింది. ఈ సమయంలో ప్రతి వికెట్‌కు బ్యాటర్లు సగటున 44.05 పరుగులు జోడించారు. ఇదే సమయంలో బౌలర్లు ప్రతి 23.30 పరుగులకు ఓ వికెట్ పడగొట్టారు. బ్యాటర్లు, బౌలర్లు ఉత్తమ ప్రదర్శనతో స్వదేశంలో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. ఈ సమయంలో 2015లో మాత్రమే భారత్ బ్యాటింగ్ సగటు 40కి దిగువగా వచ్చింది. ఆ ఏడాదిలో నాణ్యతలేని పిచ్‌లపై దక్షిణాఫ్రికాతో ఐదు టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే. 2021 నుంచి భారత్ స్వదేశంలో 17 టెస్టులు ఆడగా.. 12 మ్యాచుల్లో విజయాలు సాధించింది. మూడు టెస్టుల్లో పరాజయం పాలైంది. ఈ సమయంలో బ్యాటింగ్ సగటు 33.40కి పడిపోయింది. 2013-2020 సమయంలో భారత్ బ్యాటింగ్ సగటులో ప్రపంచంలోనే అత్యుత్తమం. కానీ 2021 నుంచి భారత్ స్థానం ఐదుకు పడిపోయింది. 2021 నుంచి స్వదేశంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ సమీకరణాలు మారిపోయాయి. 2020 వరకు బ్యాటింగ్ సగటు 48గా ఉండగా.. 2021 తర్వాత అది 33.40కు పడిపోయింది. కానీ బౌలర్లు మాత్రం సత్తా చాటుతూనే ఉన్నారు. బౌలర్లు సగటు 21.29గా కొనసాగించారు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రమే 18.84 సగటుతో భారత బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. గెలుపోటముల పరంగా భారత్ 12-3 అత్యుత్తమ ప్రదర్శనే..గత ఐదేండ్లలో చూపించిన ఆధిపత్యం తరహా కాదు.
ఎందుకీ తడ’బ్యాటు’
స్వదేశీ టెస్టుల్లో బ్యాటింగ్ సగటు పడిపోవడానికి కారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం. గత కొంతకాలంగా విరాట్ కోహ్లి ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ యువ బ్యాటర్లు రెచ్చిపోయారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాల మోత మోగించారు. విదేశీ బ్యాటర్లకు మన పరిస్థితుల్లో పరుగుల వేట కష్టతరంగానే కొనసాగుతున్నా.. మనోళ్లు సైతం తడబాటుకు లోనవటం ఆందోళనకు దారితీస్తోంది. మన పిచ్‌లపై విదేశీ బ్యాటర్ల బ్యాటింగ్ సగటు 28.51 నుంచి 26.12కు మాత్రమే పడిపోయింది. కానీ మన టాప్ ఆర్డర్ బ్యాటర్ల సగటు 54.43 నుంచి 38.30కు పడిపోయింది. 2021 నుంచి అన్ని జట్లు భారత పర్యటనకు రాలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మాత్రమే టెస్టు సిరీస్‌లు ఆడింది. కానీ 2016-2020 సమయంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అఫ్గనిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు ఇక్కడ టెస్టు సిరీస్‌లో పోటీపడ్డాయి. విదేశీ బ్యాటర్ల బ్యాటింగ్ సగటు 2016-2020తో పోల్చితే 2021 తర్వాత 8 శాతమే తగ్గింది. కానీ భారత బ్యాటర్ల బ్యాటింగ్ సగటు ఏకంగా 29.6 శాతం పడిపోయింది. గత నాలుగేండ్లలో భారత్ స్వదేశంలో మెరుగ్గానే విజయాలు సాధించింది. స్వదేశంలో మన బ్యాటర్ల సగటు 38.3 కాగా.. విదేశీ టెస్టుల్లో 34.78గా నమోదైంది. గతంలో స్వదేశీ, విదేశీ బ్యాటింగ్ సగటుకు పెద్దగా అగాధమే ఉండేది. ఇప్పుడు అది తగ్గినా..ఈ కొలమానంలో తగ్గటం ఆరోగ్యకరం కాదు. గతంలో విదేశీ టెస్టుల్లో బ్యాటింగ్ సగటు 34.90.. సైతం అప్పట్లో ఉత్తమ ప్రదర్శనే.
అజింక్య రహానె, చతేశ్వర్ పుజార 2016-2020 వరకు వరుసగా 39.32, 56.85 సగటు సాధించారు. కానీ 2021 తర్వాత 18.87, 24.53 బ్యాటింగ్ సగటుతో నిరాశపరిచారు. విరాట్ కోహ్లి గతంలో 22 టెస్లుఓ్ల 86.17 సగటుతో ఏకంగా 10 సెంచరీలు బాదగా.. 2021 నుంచి 11 టెస్టుల్లో 34.47 సగటు మాత్రమే సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. రోహిత్ శర్మ సగటు గతంలో 101.10 ఉండగా.. ఇటీవల అది 44.87కు పడిపోయింది. కెఎల్ రాహుల్ సగటు 44.25 నుంచి 29.20కు పడిపోయింది. రవీంద్ర జడే సగటు 47.61 నుంచి 41.20కు తగ్గింది. రిషబ్ పంత్ సగటు 92 నుంచి 56.87కు పడిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశపరచటంతో బ్యాటింగ్ సగటు తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన చేయటంతో స్వదేశంలో భారత్ గొప్ప విజయాలు సాధించింది. ఇటీవల కాలంలో భారత్ స్వదేశంలో సైతం పేస్ పిచ్‌ల వైపు మొగ్గు చూపటం, ఎస్‌జి బంతిపై పరుగుల వేట గగనంగా మారటం సైతం బ్యాటింగ్ సగటు తగ్గుదలకు కారణాలుగా చెప్పవచ్చు.
భారత్ స్వదేశంలో వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో పోటీపడాల్సి ఉంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గిల్ 56 సగటుతో 450 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ రెండు ద్వి శతకాలతో 89 సగటుతో పరుగులు పిండుకున్నాడు. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల వేటలో జోరందుకుంటే.. గిల్, యశస్వి, రోహిత్ శర్మ సైతం బాదేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రానున్న ఐదు టెస్టుల్లో బ్యాట్‌తో ఏ మేరకు మెప్పిస్తారనే అంశంపై స్వదేశంలో మన బ్యాటింగ్ సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.