– ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-జైపూర్
చెన్నూర్ మండలం బావురావుపేట్ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నెం.8లో గల 27 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదల సమస్య పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యుడు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి కోరారు. ఈ మేరకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. బావురావుపేట్ శివారు ప్రభుత్వ భూమిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 2023 ఎప్రిల్ 30 నుండి ఎనిమిది వందల మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారని తెలిపారు. ఈ విషయమై గత ప్రభుత్వం 30 మందిపై అక్రమ కేసులు, ఒక బైండోవర్ కేసులు పెట్టిన తీరును వివరించారు. ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసుకొని అక్రమంగా పట్టాలు పొందిన వారికి అండగా నిలిచిన గత ప్రభుత్వం నిరుపేదలైన వారు గుడిసెలు వేసుకున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ఎంత నిర్భందం పెట్టినా అదరక బెదరక ఎండ, వానలు లెక్క చేయకుండా కారు చీకట్ల మధ్య కాలం వెల్లదీస్తున్నారని వివరించారు. ఇది జీర్ణించుకోలని భూకబ్జాదారులు 600 మంది కిరాయి మనుషులతో వచ్చి పేదల గుడిసెలు కూల్చి పెట్రోల్ పోసీ కాల్చడమే కాకుండా మహిళలను సేతం చూడకుండా దాడులు చేసి తీరు బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజేశ్వరి, గొమాస ప్రకాష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు సిడం సమ్మక్క, భూపోరాట కన్వీనర్ ఉమారాణి, ఐద్వా నాయకురాలు బండారి రాజేశ్వరి, జిల్లా కమిటి సభ్యులు తుమ్మ రేణుక, వ్యవసాయ కార్మిక సంఘం చెన్నూర్ ఏరియా కార్యదర్శి రాతిపల్లి నగేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అభినవ్, కేవీపీఎస్ చెన్నూర్ పట్టణ నాయకులు కామెర మధు నాయకులు రమాదేవి, భూదేవి, సంధ్య, యామిని, లస్మయ్య, సరిత, ఎల్లమ్మ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి
నస్పూర్ : పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేస్తూ, వారిపై దాడి చేసిన కబ్జాదారులకు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పైళ్ళ ఆశయ్య అన్నారు. శనివారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.