– సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య
– 14వ రోజుకు చేరుకున్న అంగన్ వాడీల నిరవధిక సమ్మె
– కండ్లకు గంతలతో మోకాళ్ళపై కూర్చుని నిరసన
నవతెలంగాణ-ఆమనగల్
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమనగల్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంగన్‌వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షా శిబిరంలో ఆదివారం అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు కండ్లకు గంతలతో మోకాళ్ళపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీలు 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే అంగన్‌వాడీ ఉద్యోగులు అందరిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడ్తూ కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాయింట్ యాక్షన్ కమిటీతో చర్ఛలు జరిపి అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని కురుమయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి అనసూయమ్మ, ఉపాధ్యక్షురాలు పద్మమ్మ, కమిటీ సభ్యులు సంధ్య, అలివేలు, సబిత, రాజ్యలక్ష్మి, అంగన్ వాడీ ఉద్యోగులు ఆయాలు ధనలక్ష్మి, రజిత, అలివేలు, సువర్ణ, జ్యోతి, రుకియా, శ్రీదేవి, నూర్ బి, ఖాజా బి, లక్ష్మమ్మ, రాములమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.