– టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోని గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం106) రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నవంగర జీపీ కార్మికులను కలిసి, ఈనెల 17 న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. సంవత్సర కాలంగా ప్రజా పరిపాలన కొనసాగించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రతినెల మొదటి తారీఖున గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.? పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీల్లో అదనపు సిబ్బందిని నియమించి, పని భారాన్ని తగ్గించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామని, డిసెంబర్ 17 తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక వర్గం కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాడియ బీకు మాట్లాడుతూ.. సకాలంలో జీపీ కార్మికులకు వేతనాలు అందగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ స్పందించి గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 17 న హైదరాబాద్ లో జరిగే మహాధర్నాకు జిల్లా జిల్లా నలువైపుల నుండి జీపీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాల సోమ నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తొగరు మధుకర్, మండల నాయకులు పైండ్ల లక్ష్మణ్, కందుకూరి పద్మ, జలగం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.