
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ.. గత మున్సిపల్ కమిషనర్ కి పలు సమస్యలపై అనేకమార్లు విన్నవించిన సమస్యలు పరిష్కారం ఏమాత్రం కాలేదని తెలిపారు. ప్రస్తుతం సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. చనిపోయిన కార్మికులకు దహన సంస్కారాలకై రూ.20,000 చెల్లించాలని, మున్సిపల్ కార్మికులను ఇతర పనులకు ఇవ్వకుండా మున్సిపల్ పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు. కార్మికులకు చెప్పులు, సబ్బులు, నూనెలు, బట్టలు, పనిముట్లు, సకాలంలో ఇవ్వాలన్నారు. శానిటేషన్ విభాగంలో పనిచేసే డ్రైవర్ లందరికీ గత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయలను బకాయిలతో చెల్లించాలన్నారు. అర్హులైన వారికి జవాన్లుగా ఆఫీస్ సిబ్బందికి అవకాశం ఇవ్వాలన్నారు. కార్మికులపై పనివారాన్ని తగ్గించి సిబ్బందిని పెంచాలన్నారు. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకురాలు నూర్జహాన్,తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.