పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరించాలి

పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరించాలి– కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ కోకన్వీనర్‌ శశికాంత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కోకన్వీనర్‌ శశికాంత్‌ మాట్లాడుతూ పెన్షన్‌దారులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులలో నగదురహిత వైద్యం అందించాలని పేర్కొన్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఆదాయ పన్నులో మినహాయింపు ఇస్తున్నారో పెన్షనర్‌లకు అదే విధంగా వర్తింపజేయాలన్నారు. ఈ నెల 30న ఇందిరా పార్కు వద్ద మౌనప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ సుధాకర్‌, సభ్యులు దయాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌, మాదం గంగాధర్‌, ప్రేమ్‌కుమార్‌, ఎండీ మస్తాన్‌, మురళీధర్‌, జగన్మోహన్‌, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.