– ఎస్పీకి కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
పాల్వంచ పట్టణంలో రిలయన్స్ స్టోర్‌లో స్థానిక హమాలీలకు అన్ లోడింగ్‌పని ఇస్తూ చేసుకున్న ఒప్పందాన్ని అమలుకు సహకరించాలని ఎస్పీ రోహిత్ రాజుని కలిసిన సీఐటీయూ, ఏఐటియూసీ ప్రతినిధులు కోరారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యను ఎస్పీకి వివరించారు. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రిలయన్స్ ప్రతినిధులతో భద్రాచలం రోడ్ హమాలీ యూనియన్, సీఐటియూతో జరిగిన చర్చల్లో పరస్పరం అంగీకారానికి వచ్చిన అన్ లోడింగ్ పని ఒప్పందాన్ని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. స్టోర్ ఎదుట ధర్నా చేసిన ప్రతీ సందర్భంలో హామీ ఇవ్వడం, వాయిదాలు మీద వాయిదాలు పెట్టడం చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీకి సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధి బృందం వివరించారు. గత 29 సంవత్సరాల క్రితం పాల్వంచ పట్టణంలో లోడింగ్, అన్ లోడింగ్ పనిని ఏయే ప్రాంతాలు ఏఏ యూనియన్‌లు చేయాలో సమస్య ఎదురైనప్పుడు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి సమక్షంలో చర్చలు జరిగి, యూనియన్‌ల మధ్య ఏరియాలను నిర్ణయిస్తూ ఒక ఆర్డర్‌ని ఇచ్చారని తెలిపారు. దాని ఆధారంగా రిలయన్స్ స్టోర్‌లో అన్ లోడింగ్ పనిని భద్రాచలం రోడ్ హమాలీ యూనియన్‌కి ఇవ్వాలని అన్నారు. దీని ప్రకారంగానే రిలయన్స్ యాజమాన్యం దగ్గర చర్చలు జరిగాయని, ఈ చర్చల్లో ఐదుగురు హామాలిలను పనిలో తీసుకుంటామని, నెలకు రూ.75 వేలు ఇస్తామని అంగీకరించారని అన్నారు. జనవరి 1 నుండి పనిలోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ మూడు నెలలు పూర్తి అయినప్పటికీ నేటి వరకు ఒప్పందాన్ని అమలుకు సిద్ధపడటం లేదని అన్నారు. ఈ ఒప్పందాన్ని అమలుకి సంపూర్ణంగా సహకరించాలని ఎస్పీని కార్మిక సంఘాల నాయకులు కోరారు. సమస్యపై స్పందించిన ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కార్మికులది న్యాయమైన సమస్య ఆని, సమస్య పరిష్కారంలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన ప్రతినిధి బృందంలో సీఐటియూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్, ఉపాధ్యక్షులు ఎంవి.అప్పారావు, దొడ్డ రవి కుమార్, ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య, సీఐటియూ జిల్లా సహాయ కార్యదర్శులు డి.వీరన్న, కె.సత్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, హమాలీ యూనియన్ నాయకులు గట్టయ్య, రాములు తదితరులు ఉన్నారు.