ఆర్పీల సమస్యలను పరిష్కరించాలి

– ఆర్పీల జిల్లా అధ్యక్షురాలు హంసమ్మ జిల్లా కలెక్టర్‌కు ఆర్పీల వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా మెప్మాలో పని చేస్తున్న ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షురాలు హంసమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ శశాంకను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని మహిళతో పొదుపు చేయిస్తూ ఆర్థిక స్వావలంభనకు కషి చేస్తున్న ఆర్పీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం పెంచిన వేతనాలు ఇవ్వకపోగా అంతకుముందు ఆరు మాసాల వేతనాలు నేటికీ చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2023 జూన్‌ నెల నుండి సెప్టెంబర్‌ వరకు రూ.4,000లు, అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ వరకు రూ.6,000ల పెండింగ్‌ వేతనాలు వెంటనే ఇప్పించాలన్నారు. తమ కుటుంబాల పోషణకు నెలకు రూ.20వేల గౌరవ వేతనము అమలు చేయాలన్నారు. తమకు చెల్లించే వేతనం వీఎల్‌ఆర్‌, స్త్రీనిధి నిధుల నుండి కాకుండా ప్రభుత్వ పరంగానే బడ్జెట్‌ కేటాయించాలన్నారు. ప్రతినెల గౌరవ వేతనాలు ఇప్పించాలని కోరారు. ఆర్పీలకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేసి, రూ.10 లక్షల ఆరోగ్య బీమ, రూ.10 లక్షల ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని కోరారు. జాబ్‌ చార్ట్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయ, స్వప్న, సుజాత, లావణ్య, స్వరూప, రమ్య, సమత, శ్రీలత ఉన్నారు.