– ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ డిమాండ్
– రెండో ఏఎన్‌ఎంల చలో అసెంబ్లీ.. అరెస్ట్
– అరెస్టులకు నిరసనగా గోషామహల్ స్టేడియంలో ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెండో ఏఎన్‌ఎం (ఏఐటీయూసీ) సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. విడతల వారీగా పెద్దఎత్తున తరలివచ్చిన ఏఎన్‌ఎంలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 4000 మంది రెండో ఏఎన్‌ఎంలు, ఇతర ఎన్‌హెచ్‌ఎం స్కీమ్ సిబ్బందిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వారిని ఇక్కడ పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంలో బంధించడం అన్యాయమన్నారు. ఏఎన్‌ఎంలది న్యాయమైన సమస్య అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏఎన్‌ఎంల పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు మాట్లాడుతూ.. 15 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న రెండో ఏఎన్‌ఎంలను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విషయాన్ని అడగడానికి వచ్చిన ఏఎన్‌ఎంలకు సమాధానం చెప్పే ధైర్యం లేక అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్బంధాలకు కార్మికవర్గం భయపడదని, మరింత చైతన్యవంతమై భవిష్యత్ ఉద్యమాలను ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. అరెస్టులకు నిరసనగా స్టేడియంలో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వనజ, ప్రధాన కార్యదర్శి మధురిమ, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ, నాయకులు పర్వీన్ పద్మ, రజిని, నీరజ తదితరులు పాల్గొన్నారు.