ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

నవ తెలంగాణ- రాయపోల్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్షులు తుడుం శివలింగం అన్నారు. బుధవారం రాయపోల్‌ మండల కేంద్రం ప్రజా పరిషత్‌ కార్యాలయంలో యూటీఎఫ్‌ 2024 క్యాలెండర్‌ను ఎంపీడీవో మున్నయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, మొదటి తారీఖున వేతనాలు చెల్లించాలని, నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్‌ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఫర్నిచర్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలాగే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని,బదిలీ అయి రిలీవ్‌ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలివ్‌ చేయాలని, ఉపాధ్యాయలు, సిబ్బంది ఖాళీలను గుర్తించి పూర్తిస్థాయి ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు.ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మీనారాయణ,సీనియర్‌ అసిస్టెంట్‌ ముత్తాలిఫ్‌, యుటిఎఫ్‌ రాయపోల్‌ మండల ఉపాధ్యక్షులు బి. రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి సూరం నరసింహ, నాయకులు కనకరాజు, కరుణాకర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.