రవాణారంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : తెలంగాణ ఆటో, మోటార్‌ రవాణారంగ కార్మికుల జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని రవాణారంగ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని తెలంగాణ ఆటో, మోటార్‌ రవాణారంగ కార్మికుల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. బీఆర్‌టీయూ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ కిరణ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్‌ గౌడ్‌, టీఏడీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్తిరెడ్డి, స్కూల్‌ వ్యాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో, మోటార్‌ రవాణా కార్మికుల సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం ఉద్యమించాలని తీర్మానం చేశారు. తమ సమస్యలు పరిష్కరించిన రాజకీయ పార్టీలకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలరీ, ఆటో మీటర్‌ చార్జీలు పెంచి, అర్హులైన వారికి ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఇండ్లు కేటాయించాలనీ, ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలనీ డిమాండ్‌ చేశారు. అన్ని జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను వివరించాలని నిర్ణయించినట్టు నాయకులు తెలిపారు. హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వివరించారు.