
నిరుద్యోగ ఉద్యోగుల సమస్యల పరిష్కారణకై చట్టసభల్లో గొంతుకగా నిలబడి వినిపిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ యందు శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ,చట్టసభల్లో నిలబడి అట్టడుగు ,బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షల శిక్షకునిగా నిరుద్యోగుల సమస్యలను, ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర ఉండి చూసినానని ,వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార సాధనలో తోడ్పాటును అందిస్తానని అన్నారు. 19 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి పట్టభద్రుల , నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పడుతున్నట్టు తెలిపారు. కేరళ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వరదలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందించినట్టు ఇవే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. భావితరాల రాజకీయాలకు బాటలు వేసే తనను ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్టు, ఓటు అనే ఆయుధంతో పెద్దల సభకు గెలిపించాలని ఆయన కోరినారు. ఈ కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.