వీఓఏల సమస్యల్ని పరిష్కరించాలి

– న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే పట్టదా?
– రాష్ట్ర సర్కారు వెంటనే జోక్యం చేసుకోవాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజ్‌కుమార్‌, ఎం.నగేశ్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం హైదరాబాద్‌లోని సెర్ప్‌ కార్యాలయంలో డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏప్రిల్‌ 17 నుంచి నిరవధికంగా జరుగుతున్న వీఓఏల సమ్మెలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. గ్రామాల్లో మహిళలు అభ్యున్నతికి పాల్పడటంతో పాటు అనేక సంక్షేమ పథకాల అమలులో వీఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. వీఓఏలను వెంటనే సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారికి రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారికి సెర్ప్‌ నుంచి ఐడీ కార్డులివ్వాలన్నారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలన్నారు. జాబ్‌చార్టుతో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దని డిమాండ్‌ చేశారు. వీఓఏలపై మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్‌హెచ్‌జీలకు వీఎల్‌ఆర్‌, అభయహస్తం డబ్బులు చెల్లించాలని కోరారు. ఎస్‌హెచ్‌జీ, వీఏ లైవ్‌ మీటింగ్‌లను రద్దు చేయాలనీ, అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు.