– కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై అధికారులతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు సంబంధించి, వాస్తవ అవసరం మేరకు భూసేకరణ చేపట్టాలన్నారు. మూడో రైల్వే లైన్‌కు సంబంధించి, జిల్లాలో 59.17 హెక్టార్ల భూసేకరణ జరపాల్సివుండగా, 54.28 హెక్టార్లకు అవార్డ్ పాస్ చేసి, భూమిని స్వాధీనం చేసుకొని, రైల్వే లకు అప్పగించినట్లు తెలిపారు. మిగులు 4.11 హెక్టార్లకు గాను చర్యలు వేగవంతం చేసి, మూడో లైన్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డోర్నకల్ జంక్షన్, భద్రాచలం రోడ్ జంక్షన్ ల మధ్య రైల్వే డబ్లింగ్ లెన్ ప్రాజెక్టుకు సంబంధించి సింగరేణి మండలం కమలాపురం, పోచారం, సింగరేణి, కారేపల్లి, కోమట్లగూడెం, రేలకాయలపల్లి గ్రామాల్లో 57.045 ఎకరాల భూసేకరణ కు గాను జెఎంఎస్ సర్వే ప్రక్రియ చేపట్టి, పిఎన్ పబ్లిష్ చేయాలన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లి, చింతకాని మండలం బస్వాపురం, నాగులవంచ, పాతర్లపాడు, ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, రైల్వేలకు అప్పగించాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్యాకేజి-1కి జిల్లాలో 548.08 ఎకరాల భూసేకరణకు గాను, 507.2925 ఎకరాలకు అవార్డ్ పాస్ కాగా, రూ. 144.84 కోట్లు భూమి కోల్పోయిన రైతుల ఖాతాలకు జమచేసినట్లు ఆయన అన్నారు. ఇంకనూ 40.1875 ఎకరాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇదే ప్రాజెక్ట్ ప్యాకేజి-2 క్రింద 424.19 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, 407.0450 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి, ఇప్పటివరకు రూ. 98.34 కోట్లు పరిహారం చెల్లించినట్లు, ఇంకనూ 17.1450 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్యాకేజి-3 క్రింద 383.3325 ఎకరాల భూసేకరణకు గాను 371.1200 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి, రైతుల ఖాతాలలో రూ. 88.94 కోట్ల పరిహారం జమచేశామన్నారు. మిగులు 12.2125 ఎకరాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ (పాలేరు లింక్ కెనాల్) కింద ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో 1717.34 ఎకరాల భూసేకరణ కుగాను, 1569.39 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి, ఇప్పటి వరకు భూ పరిహారం క్రింద రూ. 93.39 కోట్లు, నిర్మాణాల పరిహారం క్రింద రూ. 7.30 కోట్లు విడుదల అయినట్లు ఆయన తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ (సత్తుపల్లి ట్రంక్ కెనాల్) క్రింద 330.15 ఎకరాల భూసేకరణకు గాను 325.30 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి, రూ. 19.59 కోట్లు పరిహారం క్రింద ఇప్పటికి విడుదల చేసినట్లు ఆయన అన్నారు. ఏన్కూరు వద్ద 18 ఎల్ కెనాల్, బుగ్గవాగు ప్రాజెక్ట్ ల భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ కొరకు 190.16 ఎకరాల భూసేకరణ ప్రక్రియ క్షేత్ర స్థాయి తనిఖీలు చేసి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఇండిస్టీ, రోడ్ల విస్తరణ, ఆర్ యుబి, గోడౌన్ల నిర్మాణం, సింగరేణి కాలరీస్ కంపెనీ కి సంబంధించి జేవీఆర్ ఓసిపి, కిష్టారం ఓసిపి ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ పనుల్లో వేగం పెంచి, జాయింట్ సర్వే లు పూర్తిచేసి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల పూర్తితో రవాణా, సాగునీటి వ్యవస్థ బలపడి, జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఆర్డీవోలు జి. గణేష్, ఎల్. రాజేందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, మైనింగ్ ఏడి సాయినాథ్, జాతీయ రహదారుల, రోడ్లుభవనాల, ఇర్రిగేషన్, మునిసిపల్, రైల్వే శాఖల అధికారులు, జిల్లాలోని తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.