– ఎర్రజెండాల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం : సీపీఐ శతజయంతి సభలో కూనంనేని
నవతెలంగాణ-ఖమ్మం
కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీఐ శతజయంతి సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత ధర్నా చౌక్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన సాగింది. అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ పార్టీ పుట్టుక నుంచి అనేక నిర్భందాలను ఎదుర్కొన్నదని, దాదాపు ఒకే సమయంలో ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్ దేశ విచ్చినాన్ని కోరుకుంటే భారత కమ్యూనిస్టుపార్టీ కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సంపన్నవర్గాల కోసం పనిచేసిందని టాటా, బిర్లా, గోయంకా, మఫత్లాల్ లాంటి పారిశ్రామిక వేత్తల కోసం కాంగ్రెస్ పని చేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం కమ్యూనిస్టులదేనని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే అనేక చట్టాలొచ్చాయని అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. కమ్యూనిస్టుల తాగ్యాలతో తెలంగాణ పుణీతమైందన్నారు. భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. భవిష్యత్‌లో కమ్యూనిస్టుల ఐక్యత విలీనానికి సీపీఐ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.