శాస్త్ర ప్రగతే.. దేశ ప్రగతి

Shastra Pragathe.. progress of the country– జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా. కోయ వెంకటేశ్వరరావు
– విజ్ఞాన జ్యోతి పబ్లిక్‌ స్కూల్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌/సిటీబ్యూరో
శాస్త్రం ప్రగతే దేశ ప్రగతి అని, దేశంలో శాస్త్రరంగాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ దిశగా జేవీవీ కృషి చేస్తోందని చెప్పారు. బుధవారం జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్‌ కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞాన జ్యోతి పబ్లిక్‌ స్కూల్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ కమిటీ అధ్యక్షులు ఎస్‌.రవి అధ్యక్షత వహించారు. అలాగే, జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్‌ నగర కమిటీ, రాజాబహదూర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఫార్మసీ మహిళా కళాశాల సంయుక్తంగా కళాశాలలో సైన్స్‌ సంబురాలు నిర్వహించాయి.
విజ్ఞాన జ్యోతి పబ్లిక్‌ స్కూల్‌లో ముఖ్య ఉపన్యాసకులుగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సైన్స్‌ మన జీవన గమనానికి, గమ్యానికి దోహద పడుతుందన్నారు. ప్రకృతి, సమాజాన్ని గురించిన నియమాలను అవగాహన చేసుకోవాలన్నారు. సైన్స్‌కు సంబంధించిన వాస్తవాలను అనుభవాల ద్వారా సృజాత్మకతను పెంపొందించే విధంగా, ప్రయోగాల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నేడు కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు మిడి మిడి జ్ఞానంతో అశాస్త్రీయ ప్రచారాలు చేస్తూ సైన్స్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భావవాద అశాస్త్రీయమైన ప్రచారాలు, మూఢ నమ్మకాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొన్ని గట్టి చట్టాలు అమలు చేయాలని.. అందులో ప్రజలను, విద్యార్థుల ను భాగస్వాములుగా చేయాలని కోరారు. సీనియర్‌ నాయకులు మోహన్‌ మాట్లాడుతూ.. సృష్టి క్రమాన్ని, జీవ పరిణామాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదివి.. పిల్లలకు వివరిస్తూ సైన్స్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రశ్నించే స్వభావం ఏర్పర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక సీనియర్‌ నాయకులు ఎస్‌.జితిన్‌ ప్రసాద్‌, విజ్ఞాన్‌ జ్యోతి పబ్లిక్‌ స్కూల్‌ సీనియర్‌ ప్రిన్సిపాల్‌ జె.అరుణ కుమారి పాల్గొన్నారు.
ఫార్మసీ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ ఎ.రామచంద్రయ్య మాట్లాడారు. సూడో సైన్స్‌ ప్రజలను అంధకారంలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని సూచించారు. విద్యార్థులు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించాలన్నారు. శాస్త్రీయ ఆలోచనలు సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని చెప్పారు. నేటి పాలకులు సైన్స్‌ ప్రయోగాలను ప్రోత్సహిస్తేనే సైన్స్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సైన్స్‌ రంగానికి కేటాయింపులు మరింత పెంచాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సుమకాంత్‌ మాట్లాడుతూ.. సమాజంలో మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులంతా శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్‌ నగర నాయకులు ఎస్పీ లింగస్వామి, వెంకట్‌, ఆర్‌బీవీఆర్‌ ఫార్మసీ మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.విజయ భార్గవి, అధ్యాపకులు అనుశ్రీ, అపర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.