– ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలు
– ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
– తలసరి ఆదాయం 3.17 లక్షలకు చేరింది
– 5.5 లక్షల కోట్ల నుంచి 12.93 లక్షల కోట్లకు జీఎస్‌డీపీ
– నాలో సత్తువ ఉన్నంతవరకు సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తా
– దశాబ్ది ఉత్సవాల వేడుకలో సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతి దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలో కరోనాతో దాదాపు మూడేండ్ల కాలం వృథా అయినా ఆరేండ్లల్లోనే ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగిపోతున్నదని చెప్పారు. రాష్ట్రం చేరుకోవాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయనీ, ప్రజలందరీ దీవెనలతో తనలో సత్తువ ఉన్నంత వరకూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పరిశ్రమిస్తూనే ఉంటానని ప్రజలకు మాటిచ్చారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఏయే రంగాల్లో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిందని సీఎం కేసీఆర్ వివరించారు. అటు తెలంగాణ ఉద్యమంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ఉద్యోగులు, ప్రజలు ప్రదర్శించిన స్ఫూర్తినీ, అమరుల ఆశయాలను, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని మననం చేసుకోవాల్సిన తరుణం అసన్నమైనదన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నేటి నుంచి 21 రోజుల పాటు నిర్వహిస్తున్నామనీ, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో గల గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలను జాతీయ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మలిదశ ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో జరిగిన ప్రగతి ప్రస్థానాన్ని వివరించారు. సచివాలయం పక్కనే 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇంకెక్కడి తెలంగాణ అని ప్రజల్లో నిర్వేదం అలుముకున్న సమయంలో ఆ నిర్వేదాన్నీ, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపండిందని గుర్తుచేశారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర తనకు లభించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామనీ, కరోనా కాలంలోనూ గత పీఆర్సీలో 30 శాతం పిట్‌మెంట్ ఇచ్చామన్నారు. అంగన్‌వాడీలు, ఆశాల గౌరవ వేతనాలు పెంచామన్నారు. వీఆర్‌ఏల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాలనా సంస్కరణలు తీసుకొచ్చామనీ, కొత్తజిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణకు హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 27 శాతానికి పెరిగిందని చెప్పారు. ఐటీరంగంలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి, నిరంతరాయ విద్యుత్, మెరుగైన శాంతిభద్రతలతో అనేక ఐటీ పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. 2014కు ముందు 3.2 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే…ఇప్పుడు రాష్ట్రంలో వారి సంఖ్య 8,27,124కి పెరిగిందన్నారు.
సంపదను పెంచుదాం….ప్రజలకు పంచుదాం
‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి..తెలంగాణను పునర్నిర్మించుకో వాలి’ అనే నినాదంతో ముందడుగు వేసి నేడు దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సంపద పెంచుదాం..ప్రజలకు పంచుదాం అనే నినాదం తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందన్నారు. 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104 కోట్లుంటే..రాష్ట్రం సాధించిన ప్రగతితో రూ.3,17,115 రూపాయలకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ విలువ రూ.5,05,849 కోట్ల నుంచి 12,93,469 కోట్లకు చేరిందని సగర్వంగా చెప్పారు. రాష్ట్రంలో 155 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవనీ, వరి కోతలే కనిపిస్తున్నాయని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. ఎత్తిపోతలతో తరలించిన నదీజలాలతో తెలంగాణ బీడు భూములన్నీ తరిభూములయ్యాయని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులకు మళ్లీ జల వచ్చిందనీ, మిషన్ భగీరథతో తాగునీటి వ్యథలకు చరమగీతం పాడామని వివరించారు. వృత్తిపనుల వారికి ఆర్థిక ప్రేరణ ఇవ్వడంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరిందని తెలిపారు.
పోడు భూములకూ పట్టాలు, రైతుబంధు
దశాబ్ది వేడుకల వేళ ఈ నెల 24 నుంచి ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలను అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అటవీ భూములపై ఆధారపడిన 1.50 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించబోతున్నామని ప్రకటించారు. ఆ భూములకు రైతు బంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతున్నదన్నారు.
పేదలకు ఇండ్ల స్థలాలు…జూలైలో గృహలక్ష్మి పథకం
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో దశాబ్ది వేడుకల్లో అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సొంత స్థలముండి ఇండ్లు కట్టుకోలేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామనీ, ఆ పథకాన్ని జూలైలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే, ఆ సహాయాన్ని మూడు దశల్లో ఇస్తామని తెలిపారు. పేదలకు ఉచితంగా రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించి ఇచ్చే పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. పేదలకు గృహనిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అనీ, దాన్ని కొనసాగిస్తామని నొక్కి చెప్పారు.
వృత్తిపనుల వారికి ఆర్థిక ప్రేరణ..రెండో విడత గొర్రెల పంపిణీ
దశాబ్ది వేడుకల్లో బీసీ కుల వృత్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద రూ.లక్ష సాయం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే విధంగా గొల్లకురుమలకు రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేస్తామని మరోమారు చెప్పారు.
ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుధ్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనని తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకున్నానన్నారు. ఒక్క తెలంగాణలోనే 99.95 శాతం నల్లా నీళ్లలో కలుషిత కారకాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ ‘వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదిక’ ద్వారా చెప్పడం గర్వకారణంగా ఉందనీ, నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్‌జీవన్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు మిషన్ భగీరథకు దక్కాయన్నారు.
ఉద్యమంలా దళితబంధు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో విప్లవాత్మకమైన దళిత బంధు పథకం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. 118 నియోజకవర్గాల్లో 1.30 లక్షల మందికి దళిత బంధు పథకం అందిస్తున్నామని వివరించారు. విదేశాల్లో చదివే దళిత విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌ఫిప్ కింద రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దళితుల గృహఅవసరాల కోసం 101 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.
ఆశ్చర్యపోయేలా స్థానికసంస్థల అభివృద్ధి
నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవ్వరైనా ఇవి ఒకప్పటి గ్రామాలేనా? ఎంతలో ఎంత మార్పు? అని ఆశ్చర్యపోయేలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి ఊరికీ పంచాయతీ కార్యదర్శిని నియమించామన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తున్నామని చెప్పారు. 12,769 గ్రామాలుంటే అన్నింటినీ ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంకును మన రాష్ట్రం సాధించిందనీ, ఇటీవల జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు లభించగా సర్పంచులు రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారని వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు రావడం గొప్ప విషయమన్నారు. నేడు పల్లెలు, పట్టణాలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ విజయం
తెలంగాణ రాష్ట్రమొస్తే అంధకారమవుతుందనీ, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేసిన వారి అంచనాలను తలక్రిందులు చేశామనీ, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశనలుమూలలా వ్యాపించిందని సీఎం కేసీఆర్ వివరించారు. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం త్రిముఖ ప్యూహాన్ని అనుసరించామని తెలిపారు.
సాగునీటి రంగంలో స్వర్ణయుగం
‘తలాపునా పారుతుంది గోదారి..మను చేను, మనచెలుకా ఎడారీ’ అని పాటలు పాడుకోవడం ఇంకెన్నాళ్లు అని సాగునీటి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను ఉద్యమ సమయంలో స్పష్టంగా నిర్దేశించుకున్నామనీ, దాన్ని అమల్లో తీసుకొచ్చి నేడు సాగునీటి రంగంలో స్వర్ణయుగం సాధించామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం పూర్తయిందనీ, ఆ ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టమని అన్నారు. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80 శాతానికిపైగా పూర్తయిందని చెప్పారు. అనేక పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసుకునే దిశగా ప్రయాణిస్తున్నామన్నారు. ప్రాజెక్టులపూర్తి, మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీత, కాల్వల ద్వారా చెరువులు నింపడం వంటి చర్యలతో రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయన్నారు. గతంలో పొట్టచేతబట్టుకుని వలసెళ్లిన జనం తిరిగి సొంతూర్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరాయని వివరించారు. రాష్ట్రంలో 75 లక్షలకు సాగునీటి వసతి ఏర్పడిందనీ, రెండు,మూడేండ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు.
పండుగలా సాగు..భూమి బరువయ్యేలా దిగుబడి
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దు:ఖమనీ, పాలకులు సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో అద్భుత పరివర్తన వచ్చిందన్నారు. సాగు సరిగ్గా సాగాలంటే నీళ్లొక్కటే సరిపోవని గుర్తించే రైతు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. 65 లక్షల మంది ఖాతాలో 65వేల కోట్ల రూపాయలకుపైగానగదు జమచేయడం ఎవరైనా ఊహిస్తారా? అని అడిగారు. రైతుబంధు పథకం కేంద్ర పాలకుల కండ్ల సైతం తెరిపించిందన్నారు. ఏ కారణంచేతనైనా రైతు మరణిస్తే ఆదుకునేందుకు తీసుకొచ్చిన రైతుబీమా పథకం కింద బాధిత కుటుంబాలకు పదిరోజుల్లోపే రూ.5 లక్షల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఊర్లలోనే పంటను మద్దతు ధరతో కొంటున్నామని చెప్పారు. కేంద్రం నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోటీ 21 లక్షల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
ప్రజాసంక్షేమే పరమావధిగా..
రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రమే లేదన్నారు. తొమ్మిదేండ్లలో 1002 గురుకుల జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 5.59 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన వసతులతో విద్యను అందిస్తున్నామన్నారు. అంపశయ్యమీద ఉన్న ఆరోగ్యరంగాన్ని గాడిలో పెట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టూ నాలుగు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులను కడుతున్నామని తెలిపారు. నిమ్స్, వరంగల్ ఆస్పత్రులను విస్తరిస్తున్నా మన్నారు. బస్తీదవాఖాలను తీసుకొచ్చామన్నారు. మెరుగైన వసతుల కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 62 శాతానికి పెరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఆసరా పింఛన్లను రూ.200 నుంచి రూ.2,016కి పెంచామన్నారు. రాష్ట్రంలో ఆసరా ద్వారా 44లక్షలకుపైగా లబ్దిపొందుతున్నారని వివరించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లీలకు సహాయం కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాల ద్వారా 11వేల కోట్ల రూపాయలను ఖర్చుచేశామని తెలిపారు. చేనేత కార్మికులకు చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రంగులపై 40 శాతం సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. వారికి పావల వడ్డీకే రుణాలిస్తున్నామని చెప్పారు. వారికి లక్ష రూపాయల వరకకు రుణమాఫీ చేశామన్నారు. నేతలకు మరింత ఉపాధి చూపెట్టేలా బతుకమ్మ చీరల తయారీని వారికే అప్పగిస్తున్నామన్నారు. మత్య్సకారుల సంక్షేమం కోసం రూ.500 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. గీతకార్మికులకు చెట్ల పన్నును రద్దుచేశామనీ, వైన్‌షాపుల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గీతకార్మికులకు పింఛన్ల కింద ఇప్పటిదాకా రూ.800 కోట్లను ప్రభుత్వం అందించిందన్నారు. మైనార్టీలు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, నామా నాగేశ్వర్ రావు, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగులు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీలు కవిత, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, గోరేటి వెంకన్న, రవీందర్ రావు, విఠల్, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎల్విస్ స్టీవెన్ సన్, ప్రభుత్వ సలహాదారులు ఏకేఖాన్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు, ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా, సీఎం మనవడు హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.