– 109 ఇండిస్టియల్ పార్కుల ఏర్పాటు
– లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు
– సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతుందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో కొత్త పాలసీని రూపొందించి ప్రణాళికా బద్ధంగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. కొత్త పాలసీ రూపకల్పనతో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం సులభతరమైంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు మంజూరు నుంచి మౌలిక వసతుల కల్పన, అన్ని ఆన్ లైన్‌లోనే చేసింది. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండటంతో ఎన్నో బహళ జాతీయ సంస్ధలు తెలంగాణలో తమ పెట్టుబడులు పెట్టాయి. ఇంకా చాలా సంస్థలు తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి.సొంతంగా వ్యాపారాలు ప్రారంభించా లనుకునే తెలంగాణ యువకులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందించే విధంగా పాలసీని రూపొందించింది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో మంది తెలంగాణ యువకులు పారిశ్రామిక వేత్తలు కావడమే కాకుండా లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు
కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తూ ఇండిస్టియల్ పార్కులను రూపొందించింది. తెలంగాణ స్టేట్ ఇండ స్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతు లను సమకూరుస్తూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో ఐదేండ్లల్లో 70 పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఈ పార్కుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించింది. అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దిన 7,806 ఎకరాల స్థలాన్ని 3680 సంస్ధలకు కేటాయించింది. ఇక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా ద్వరా 2,63,222 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ఐటి పరిశ్రమలకు ప్రత్యేక స్థానం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటీ పరిశ్రమలు తమ సత్తాచాటు తున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు అయితే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందనే సంకల్పంతో టీ-హబ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రపంచ ఐటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని వసతులు, అనుమతులు అందిస్తున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ అగ్రస్థానం
పరిశ్రమలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ అనుకూలమైనదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు తేల్చిచెప్పింది. 2016లో కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది.
2017, 2018లో కూడా మొదటి మూడు స్థానాలో నిలిచింది. 2020 నుంచి ర్యాంకింగ్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ పద్దతిని ప్రవేశపెట్టింది.