ప్రాజెక్టులు సరే… కాలువలేవీ…?

– బ్రాంచ్‌ కెనాళ్లు, ఫీల్డ్‌ ఛానళ్లను నిర్మించరా ?
– వృధాగా సముద్రంలోకి సాగు నీరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ అనగానే సాధారణంగా నీళ్లు, నిధులు, నియామకాలు మనకు గురొస్తాయి. అలాగే ప్రాజెక్టులు అనగానే బ్రాంచ్‌కెనాళ్లు, ఫీల్డ్‌ ఛానళ్లు గుర్తురావాలి. కానీ, అలా జరగడం లేదు. ఎద్దును కొని పగ్గానికి భయపడ్డట్టు ఉంది పరిస్థితి. భారీ ప్రాజెక్టులు కడుతున్నా ప్రభుత్వాలు, పిల్ల కాలువలను మరిచిపోతుంటాయి. దీంతో ఆశించిన లక్ష్యం ఆమడదూరంలోనే ఉంటున్నది. దీంతో ప్రజాధనం సద్వినీయోగం కావడం లేదు. ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగంలో భారీ మార్పులకు కారణమవుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడానికి ఊతమిస్తున్నయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ధనదాహం మూలంగా విలువైన జనంసొమ్ము ప్రాజెక్టుల్లోనీ నీళ్లల్లో కొట్టుకుపోతున్నది. ఆనక ఆ భారం ప్రజల నెత్తిమీద మోపాల్సి వస్తున్నది. పూర్తిస్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించని కారణంగా ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా ఉంది పరిస్థితి. ప్రమాణాల మేరకు ప్రాజెక్టులు కడితే ఆర్థిక నష్టాలు, కష్టాలు ఉండవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్న మాట.
ప్రాజెక్టు అంటే..
పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ఆమోదం పొందిన వెంటనే నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. అప్పుడే అది సమగ్ర ప్రాజెక్టు అవుతుంది. కానీ భూసేకరణ జరగలేదనీ, బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు అదనపు నిధుల కొరకు వెంపర్లాడుతూ అంచనాల సవరణ(రివైజ్డ్‌ ఎస్టిమేట్లు) పేరుతో డీపీఆర్‌లో ఉన్న మొత్తం కంటే నాలుగైదు రెట్లు పెంచిన సందర్భాలూ ఎన్నో.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువలు రెండో విడతకు సంబంధించి 77 కిలోమీటర్లు ఉన్నాయి. ఇందులో డీబీఎం( మానేరు వెనుక పంపిణీ) అధికం. వర్థన్నపేటలోని ఆకేరుసాగు నుంచి ప్ర్రారంభమై, మూసివరకు సాగుతుంది. పంపిణీ కోసం దాదాపు బ్రాంచ్‌కెనాళ్లు 20 వరకు ఉన్నాయి. వీటికి ఫీల్డ్‌ ఛానెళ్లు చాలా ఉన్నాయి. 2.30 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ కాలువలు వినియోగిస్తారు. సుమారు 30 ఏండ్ల తర్వాత వీటిని తవ్వారు. దీంతో తుమ్మలు(చెట్లు) మొలిచాయి. అప్పట్లోనే రూ.220 కోట్లు ఖర్చయ్యాయి. అవినీతి జరిగిదంటూ 12 మంది ఇంజినీర్లు, అధికారులను సస్పెండ్‌ చేశారు. ఆరు నెలల క్రితం శ్రీరాంసాగర్‌ నుంచి రెండో దశకు నీళ్లు వదిలారు. కానీ, నీటి ప్రవాహాం సరిగ్గా సాగడం లేదు. ఆ కాలువలు, చెరువులు నింపడానికి అనువుగా లేకపోవడమే. లైనింగ్‌ కూలిపోయింది. ఇసుక, సిమెంట్‌, సలాక్‌ పెట్టి మరమ్మత్తులు చేయాలి. ఇకపోతే పాలేరు నుంచి భక్తరామదాసు డిస్ట్రీబ్యూటరీ లిఫ్ట్‌ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 64 వేల ఎకరాలకు నీళ్లు వదిలారు. ఈ కాలువలూ సక్రమంగా లేవు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి 3.40 లక్షల ఎకరాలు, బీమా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2.00 లక్షల ఎకరాలు, కొయిల్‌సాగర్‌ కింద 38,250 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. కానీ, లైనింగ్‌ పనులు చేయకపోవడం మూలాన నీరు వృధాపోతున్నది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. భారీ ప్రాజెక్టులు పూర్తయినా, బ్రాంచ్‌కెనాళ్లు, ఫీల్డ్‌ ఛానెళ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉంటుండటంతో సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రధానమైన ఈ రెండు రకాల కాలువల నిర్మాణం ప్రభుత్వం చేయాలి. పిల్ల కాలువలను ఎక్కడిక్కడ స్థానికంగా ఉండే రైతులు చేసుకుంటారు.
ఎఎంఆర్‌ ప్రాజెక్టు..
ఎలిమినేటి మాధవ రెడ్డి(ఎఎంఆర్‌) ప్రాజెక్టు ఆయకట్టు రూ.2.70 లక్షల ఎకరాలు. ఈ మేరకు సాగునీరందించడానికి కాలువలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం పంపింగ్‌ సైతం జరుగుతున్నది. బ్రాంచ్‌కెనాళ్లు లేకపోవడంతో కరువు ప్రాంతాలకు నీళ్లు అందడం లేదు. ఎప్పుడో నిర్మించిన కాలువలు కూలిపోయాయి. అలాగే 2004 నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలో 14 మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టారు. అందులోనూ ఆరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పథకం ఏఐబీపీ కింద ఉన్నాయి. 2004లో చేపట్టిన ఈ ప్రాజెక్టులు పూర్తయినా, పంటకాలువలు లేకపోవడంతో ప్రాజెక్టుల నీరు వృధా అవుతున్నది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు కేటాయించారు.
సుద్దవాగు, గొల్లవాగు, ఎర్రవాగు, మత్తడివాగు, సాత్నాల, ర్యాలీవాగు మరమ్మత్తులు చేయకపోవడంతో నష్టం జరుగుతున్నది. కాలువల్లేక కేవలం 10 వేల ఎకరాలకే నీళ్లు పారుతున్నాయి. 1203 సంవత్సరంలో నిర్మించిన పాకాల, రామప్ప, లక్నవరం ప్రాజెక్టుల కింద కాలువలు బాగా దెబ్బతిన్నాయి. నీరు సద్వీనియోగం కావడం లేదు.