కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

– ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం తమిళనాడు కాంచీపురంలో నిర్వహించిన ఈనెల 1, 2 తేదీల్లో అఖిలభారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఈనెల 1, 2 తేదీల్లో అఖిలభారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు ఐక్యంగా పోరాడుదాం తీర్మానించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా హామీలను ఇచ్చిందని, కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరిస్తామని, రైతుల పై అక్రమంగా మోపిన కేసులను ఎత్తివేస్తామని తెలిపినట్టు తెలిపారు. పంటల బీమా పథకాన్ని సవరిస్తామని హామీ ఇచ్చింది కానీ హామీలను పక్కన పెట్టి కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదన్నారు. పంటల కొనుగోలు బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటున్నదని చెప్పారు. కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా లేదని మండిపడ్డారు. ప్రజా పోరాటాల పై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని,.రెజ్లర్ల డిమాండ్‌ పరిష్కరించకపోగా ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.