
– 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – తాడ్వాయి
కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే తక్షణమే అమలు చేయాలని ములుగు జిల్లా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ చేతుల మీదుగా బయక్క పేట సొసైటీ అధ్యక్షుడు ఎరుకలి గోవిందరాజు అధ్యక్షతన 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు బత్తిని రాజు గౌడ్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మల సమ్మయ్య గౌడ్ లు మాట్లాడుతూ కల్లు కు మార్కెట్ సౌకర్యం కల్పించి, కల్లు దుకాణాలు ఆధునీకరణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అలాగే చెట్ల పెంపకానికి గ్రామాల్లో భూములు కేటాయించి గీత వృత్తిని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బెల్ట్ షాపులు ఏరులై ప్రవహిస్తుండడంతో కళ్ళు అమ్ముడుపోక గీత కార్మికుల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ప్రమాదం జరిగిన 30 రోజుల్లో గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం, పది లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని వెంటనే అమలు చేసి జీవో నెంబర్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీలో “నీరా” కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు అన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు డేగల సాంబయ్య, సునీల్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు బెల్లంకొండ రోశయ్య, సొసైటీ ముస్తాదరు గడ్డం శ్రీధర్, తెలంగాణ కళ్ళు గీత కార్మిక నాయకులు మొక్క రాజు, గందమాల కిరణ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.