
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ నాయకులు సారా సురేష్ మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రజలకు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రంలో ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన వారికి తెల రేషన్ కార్డులు, రూ.10 లక్షల రూపాయలు, స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతన్న అన్నింటిని మాఫీ చేయాలని, పంటల బీమా పథకం జూలై, ఆగస్టు నెలలో అమలు చేయాలన్నారు. 20 ఎకరాల భూమి ఉన్నవారికి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఏలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని, స్కాలర్ షిప్పులను, ఫీజు రియంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పోడు సాగుదారులందరికీ పట్టాలిచ్చి రైతు భరోసా ఇవ్వాలని, నిరుద్యోగులకు జీవనభృతి ఇవ్వాలని, బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతు లేకుండా రూ.4016 జీవన భృతి చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కార్యాలయంలో ఏఆర్ ఐ గంగాధర్ కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ నాయకులు సత్యనారాయణ గౌడ్, బి.అశోక్, జి.కిషన్, ఎం.సురేష్, గంగాధర్, మహమ్మద్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.