చెట్లను నువ్వు కాపాడితే ఆ చెట్లే నిన్ను కాపాడతాయన్న పైసామెత మనకు తెలిసిందే. వేడి తీవ్రంగానే ఉంది. కొన్ని చోట్ల ట్రాక్టర్ బానెట్‌పై రోటీలు కాల్చినట్లు, మరికొన్ని చోట్ల ఇసుకలో పాపడ్ కాల్చినట్లు సోషల్ మీడియాలో చూశాం. ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలకు చేరుకుంది. మానవ శరీరం 37-38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. కానీ చాలా చోట్ల వేడి 47 నుండి 49 డిగ్రీలకు చేరుకుంది. కొన్ని చోట్ల 50 డిగ్రీల సెల్సియస్‌ను కూడా తాకే అవకాశం ఉంది. మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకారం బయట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే కండరాలు స్పందించడం ప్రారంభిస్తాయి. ప్రాణాపాయానికి సంబంధించిన కీలక అవయవాలు పనిచేయడం నుంచి గుండెపోటు వరకు సమస్యలు రావచ్చు. వేడి ప్రాణాంతకంగా మారింది.
ఇది అకస్మాత్తుగా జరగలేదు. 2024 అత్యంత వేడిగా మారబోతోందని ఈ ఏడాది ప్రారంభంలోనే హెచ్చరికలు వచ్చాయి. దీని వెనుక పసిఫిక్ సముద్రం ఎగువ ఉపరితలం ఉడికిస్తున్న ఎల్‌నినో ప్రభావం ఏ మేరకు ఉందో, సముద్రం కింద శీతల కెరటాలకు రక్షణగా నిలుస్తున్న లానినా వైఫల్యం ఏ మేరకు ఉందో వాతావరణ నిపుణులు సమీక్షిస్తున్నారు. వాతావరణ మార్పు – గ్లోబల్ వార్మింగ్ రాబోయే రోజుల్లో ఇది ఎంతటి విధ్వంసం సష్టించబోతోందనే దానిపై చాలా నివేదికలు ఉన్నాయి. లాభాపేక్షతో మత్తులో ఉన్న పెట్టుబడి వాతావరణ మార్పులకు బాధ్యత వహించాలి. భూమిపై నివసించే జీవుల ఉనికికి ముప్పుగా మారింది. అమెరికాతో సహా సంపన్న దేశాల సమూహం చేసిన విధ్వంసం కీలకమైంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరిన వెంటనే కనీసం ఒక్క చెట్టునైనా నాటాలని ప్రతి పౌరునికి సూచించడం మంచిదే. చెట్లు నాటడం చాలా మంచి విషయం. ఇది తప్పనిసరి చేయాలి. కానీ దానిని ఏకైక మార్గంగా పరిగణించడం అమాయకత్వం. ఇది జరుగుతున్న విధ్వంసక, వేగాన్ని కొన్ని వాస్తవాల నుండి అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ అండ్ అగ్రి కల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం 2015-20 మధ్య భారతదేశంలో ప్రతి సంవ త్సరం 6 లక్షల 68 వేల హెక్టార్ల అడవులు నాశనమయ్యాయి. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద అటవీ విధ్వంసం. 4 లక్షల 14 వేల హెక్టార్లలో సహజసిద్ధమైన అడవులు నేలకొరిగాయి. వీటిని మళ్లీ పెంచలేం. ఇవి కాకుండా గత రెండు దశాబ్దాల్లో 2 కోట్ల 33 లక్షల హెక్టార్ల చెట్లతో నిండిన ప్రాంతాలు నాశనమయ్యాయి. దేశంలోని చెట్లతో నిండిన భూమి 18శాతం. మరో నివేదిక ప్రకారం, గత ముప్పై ఏళ్లలో మైనింగ్, విద్యుత్, రక్షణ ప్రాజెక్టుల కోసం సుమారు 14వేల చదరపు కిలోమీటర్ల అడవులు తీసుకోబడ్డాయి.
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి కాగితంపై కొన్ని షరతులు, బాధ్యతలు ఉండేవి. అయితే, వాటి అమలు స్థితిని అర్థం చేసుకోవడానికి కేవలం ఒక ఉదాహరణ సరిపోతుంది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో గ్రేట్ పవర్ ప్రాజెక్ట్, బొగ్గు బ్లాకుల పేరుతో ఎస్సార్ (ప్రస్తుతం అదానీ), అంబానీలు ఏర్పాటు చేసిన ప్లాంట్లు తవ్వకాల్లోనే కోట్లాది వక్షాలు నేలకూలాయి. ఇంటెన్సివ్ ట్రీ ప్లాంటేషన్ చేయడం ఈ కంపెనీల బాధ్యత. కానీ ప్రాజెక్టుల్లో నరికిన 20 లక్షల చెట్లకు నష్టపరిహారం ఇప్పిస్తామంటూ సదరు కంపెనీ అన్నది. కంపెనీపై చర్య తీసుకునేందుకు నివేదికను కోరినప్పుడు సింగ్రౌలీకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్, దామోలో మొక్కలు నాటినట్లు చెప్పారు. సాగర్, దామోను చూడకుండా ప్రభుత్వాలు అతని వాదనను భక్తితో అంగీకరించాయి. 2017 జూలై 5న మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కేవలం 12 గంటల్లో 6 కోట్ల చెట్లను నాటినట్లు ప్రకటించింది. కానీ 2018 జులైలో ఆడిట్ చేసినప్పుడు ఒక్క శాతం కూడా సురక్షితంగా లేవని తేలింది.
అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ‘దేశం’ అభివద్ధికి అడ్డంకిగా ఉన్నయని 2015 సంవత్సరంలో మోడీ ప్రభుత్వ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తరువాత అటవీ చట్టాలలో మార్పులు తేచ్చారు. హైవేలు, సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవే, ఎక్స్‌ట్రా సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవేల పేరుతో జరిగిన అటవీ విధ్వంసాన్ని అభివద్ధిగా చెప్పారు. నీరు, అటవీ, భూమికి సంబంధించిన అన్ని చట్టాలను పక్కన పెట్టి అటవీ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. ఫలితంగా అడవులు ధ్వంసం కావడం, నదులు ఎండిపోవడం, భూమి తవ్వడం, గిరిజనులనే కాకుండా జంతువులు, పక్షులను అటవీ నుంచి వెళ్లగొట్టడంతో అటవీ ధ్వంసమైంది. విధ్వంసం ఎంత భయంకరంగా ఉందో చూడడానికి లాటిన్ అమెరికా లేదా నైజీరియా లేదా ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం లేదు. సింగ్రౌలి పక్కనే ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో రేణుకూట్ అనే ప్రదేశం ఉంది. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రారంభించి సింగ్రౌలీ, సిధి, ఉమారియా, షాడోల్, అనుప్పూర్ మీదుగా ఛత్తీస్‌గఢ్ చేరుతుంది. కొరియా దాటి, సర్గుజా, కోర్బాకు వెళ్తుంది. లోపలికి వెళ్లకుండా రోడ్డుపై నడిచి, మీ కంటితో నిజాన్ని చూడండి. పాలకులకు ఎన్నికల్లో గెలవడానికి విలాసాలు, సాధ నాలు మాత్రమే అందించిన కార్పొరేట్ సంస్థలు వేల ఏండ్ల నాటి అడవులు, లక్షలు, కోట్ల ఏళ్ల నాటి కొండలతో సహా అన్నింటినీ నాశనం చేశారు.
చెట్టును నాటడం ద్వారా మంచి సంకల్పం నేరవేరదు. అడవులు, భూమిలోని మానవాళిని ఎలా కాపాడుకోవాలో నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేని యంకు వ్యతిరేకంగా జరిగిన గిరిజనుల పోరాటాలు మంచి ఉదాహరణ. అడవిని రక్షించడానికి, చెట్లు నాటడం మంచిదే. కాని నిజమైన పరిష్కారం చెట్లు, అడవులు నాటడం ద్వారా రాదు. అడవుల విధ్వంసం అభివద్ధి అని చెప్పుకునే ప్రభుత్వాలపై, వారి విధానాలపై పోరాడడం ద్వారానే అడవుల విధ్వంసాన్ని అపగలుగుతాం.
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
మూడ్ శోభన్
9949725951