నిరూపించబడిన గతమే చరిత్ర

నిరూపించబడిన గతమే చరిత్ర”మతాన్ని చరిత్ర అంగీకరించదు” అంటూ ప్రారంభమైన చర్చలో పాల్గొంటూ కొండా సుమంత్‌ రెడ్డి గారు” ”హిందూ మతాన్ని మాత్రమే చరిత్ర అంగీకరించదా?” అని ప్రశ్నించి చర్చను కొనసాగించారు. అసలు చరిత్ర అంటే ఏమిటి? ”నిరూపించబడిన గతమే చరిత్ర”. నిరూపించబడని అనేక అంశాల సమూహారాన్ని పుక్కిటి పురాణం అంటారు. అవి ఏ మతానికి సంబంధించి నవైనా, అవి పుక్కిటి పురాణాలే. మతానికి సంబంధించిన గతాంశాలలో, రుజువులు ఉన్న వాటిని చరిత్ర అంగీకరించింది. అది చరిత్ర గొప్పదనం. చరిత్రకారుల నిష్పక్షపాత బుద్ధికి నిదర్శనం.
”ఈ దేశ చరిత్రను వ్రాసింది బ్రిటిష్‌ వాళ్లు” అని రాశారు సుమంత్‌ రెడ్డి గారు. అది భారతీయులు చాలా బాధతో అంగీకరించ వలసిన విషయం. వందలాదిమంది మత నాయకులు, వేలాదిమంది పండితులు, అనేక దశాబ్దాలుగా టన్నుల కొద్దీ మతసాహిత్యాన్ని సృష్టించారు. కానీ ప్రత్యేకంగా చరిత్రకు సంబంధించి ఒక్క గ్రంథాన్నీ రచించకపోవడానికి కారణం వారికి చారిత్రక స్పృహ లేకపోవడమే అని అంగీకరించవలసి వస్తోంది. భారతదేశ చరిత్ర రచనను బ్రిటిష్‌ వారు ప్రారంభించినా, ఆ తరువాత ఆర్‌.సి.మజుందార్‌, డి.డి కొశాంబి, రోమిల్లా థాపర్‌ వంటి అనేకమంది చరిత్ర ఆచార్యులు తీవ్రమైన పరిశోధనల తరువాత మాత్రమే చారిత్రక అంశాలను సాధికారికంగా ప్రకటించారు. పురాతత్వశాస్త్ర, భాషా శాస్త్ర, మానవ శాస్త్ర రుజువులున్న అంశాలనే వారు అంగీకరించారు. లేని అంశాలను వారు తిరస్కరించారు. కానీ కొందరు ”వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు” ఆ పరిశోధనా అంశాలను తిరస్కరించి, ఆ రచనలు ”వామపక్షవాదుల రచనలు” అనే సాకుతో వ్యతిరేకిస్తున్నారు. వాట్సాప్‌ పండితులు, తమ రచనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు చూపకుండానే, తమ రచనలకు ముందు ” వీటిని ఇటీవలి శాస్త్రీయ పరి శోధనలు నిరూపిస్తున్నాయి” అనే ఒకే ఒక ముక్తాయింపు వాక్యాన్ని జోడించి ఆ అంశాన్ని అంగీకరించమని ప్రజలను కోరుతున్నారు.
మరో ముఖ్య విషయం. చరిత్రకారులు నిరంతర పరిశోధనలతో చరిత్రను మరింతగా పరిపుష్టం చేశారు, చేస్తున్నారు. కొత్త రుజువులు దొరికినప్పుడు ఏ మాత్రం తటపటాయింపులు లేకుండా, పాత చరిత్రను తిరస్కరించి నూతన ఆధారాలతో కూడిన చరిత్రను అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు ఒక మరుగుజ్జు వ్యక్తిని దూరం నుండి చూసినప్పుడు అతను పిల్లవాడు అనుకుం టాము. ఆ వ్యక్తి దగ్గరగా వచ్చినప్పుడు, అతని గడ్డాలు, మీసా లు చూసి అతను వయస్సులో పెద్దవాడేననీ, అయితే మరగుజ్జు వ్యక్తి అనీ నిర్ధారిస్తాము. గతంలో అతని పిల్లవాడు అని చెప్పిన వ్యక్తి అసత్యం చెప్పాడని అతనిని నిందిస్తామా? అది ఎంత వరకు సబబు? అలాగే 1922లో హరప్పా, మొహంజొదారో శిధిలాలు బయటపడేంతవరకు భారతీ యులకు పురాతన చరిత్ర లేదని రాసినవారే, భారతదేశ చరిత్రలో సింధూ నాగరికతకు సముచిత స్థానాన్ని కల్పించి, దేశ చరిత్రను తిరగరాయడం జరిగితే, అంతకుముందు చరిత్ర రాసిన వారు అసత్యాలు చెప్పారని అనడం ఎంతవరకు సమంజసం?
అలాగే రుగ్వేద రచన సా. శ. కంటే ముందు 2000- 1500 మధ్యలో జరిగిందని చెప్పడం అనేది భాషా శాస్త్రం, ఆ కాలంనాటి చారిత్రక వ్యక్తుల పేర్ల ఉటంకింపు, ఆ గ్రంథంలో పేర్కొన్న జంతువుల పేర్లు, పేర్కొనబడని జంతువుల పేర్లు వీటన్నిటి ఆధారంగా రున్వేద రచనా కాలాన్ని నిర్ధారించడం జరిగింది. ఈ విషయాన్ని అంగీకరించకపోవడం రచయిత అమాయకత్వాన్నే సూచిస్తోంది. హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులనే ద్విజాతి సిద్ధాంతాన్ని సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ చేత ఆంగ్లేయులు చెప్పించారనీ, ముస్లిం లీగ్‌, ద్రవిడ పార్టీలు బ్రిటిష్‌ వాళ్లకు అనుకూలంగా, స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారనీ, సుమంత్‌ రెడ్డి గారు రాశారు. విచిత్రం ఏమిటంటే ముస్లిం లీగ్‌ కంటే ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవచించి, భారతీయులను విభజించి, బ్రిటిష్‌ వారికి అనుకూలంగా తీవ్రంగా శ్రమించిన వీ.డి .సావర్కర్‌ పేరును గానీ, స్వాతంత్రోద్యమంలో ఏనాడు పాలొనని ఆరెస్సెస్‌ను గూర్చి గానీ ఆయన తన వ్యాసంలో ప్రస్తావించలేదు. సావర్కర్‌ ఈ విషయంలో ఏమని ప్రవచించాడు? తెలుసుకుందాం.
” ది రైజ్‌,ఫాల్‌ అండ్‌ డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ ది ముస్లిం థియాలజీ” అనే వ్యాసంలో సావర్కర్‌ ”ముస్లింలు, వారి మతం పుట్టినరోజు నుంచీ కూడా అనాగరికమైన మతతత్వాన్నీ, అసహనంతో కూడుకున్న క్రౌర్యాన్నీ గుణాలుగా అలవరుచుకుంటూ వచ్చారు”. అని రాశారు. 1937లోనే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా ప్రకటించారు. అదే ఏడాది అహ్మదాబాదులో జరిగిన హిందూ మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ సావర్కర్‌ ”భారత దేశం ఈనాడు ఒకే జాతి తో కూడిన దేశంగా లేదు. హిందువులు, ముస్లింలు రెండు ప్రధానమైన జాతులుగా ఉన్నారు. ఈ రెండు శత్రుజాతులు ప్రక్క పక్కనే మనుగడ కొనసాగిస్తున్నాయి” అన్నారు. ఈ విషయం ”సమగ్ర సావర్కర్‌ వాద్‌ మే” అనే గ్రంథం, ఆరవ వాల్యూమ్‌, 296 వ పేజీలో ఉన్నది. ఎంత దుర్మార్గం? హిందువులు, ముస్లింలు శత్రుజాతులట! ఇంతకంటే ఘోరమైన ద్విజాతి సిద్ధాంత ప్రవచనం ఉంటుందా? విశేషమేమిటంటే, మహమ్మద్‌ అలీ జిన్నా ఆ తర్వాత మూడేండ్లకు, అంటే 1940 మార్చి 22న లాహోర్‌ లో జరిగిన ఆలిండియా ముస్లిం లీగ్‌ మహాసభలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
అంతేకాదు ముస్లిం లీగ్‌, ద్రవిడ పార్టీల లాగా సావర్కర్‌ హిందూ మహాసభ అధ్యక్షుడుగా, స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశాడు.1942లో కాంగ్రెస్‌ పార్టీ ”క్విట్‌ ఇండియా” ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు సావర్కర్‌ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందూ మహాసభ నాయకుడుగా, తన పార్టీకి చెందిన మునిసిపాలిటీలలోని, స్థానిక సంస్థలలోని, అసెంబ్లీలలోని ప్రజా ప్రతినిధులకు ”మీ స్థానాలలోనే ఉండండి. రాజీనామాలు చేయవద్దు” అని ఆదేశం ఇచ్చాడు.( ఫ్రంట్‌ లైన్‌, 1995 డిసెంబర్‌ 1 నాటి సంచిక). హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌ల బ్రిటిష్‌ అనుకూల వైఖరిని స్వాతంత్రోద్యమ నాయకులు గుర్తించి తీవ్రంగా విమర్శించారు. ఉదాహరణకు వీరిని గూర్చి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తన ఆత్మ కథ” ది ఇండియన్‌ స్ట్రగుల్‌” లో ఇలా రాశారు. ”ఈ మతతత్వ పార్టీలు పాలకులు విసిరిన రొట్టెముక్కలాంటి వాటిని తమలో తాము పంచుకోవడంలోనే నిమగమై ఉండేవి. కాంగ్రెస్‌ పార్టీని వేధించడానికీ, దాని పలుకుబడిని తగ్గించడానికీ, ఈ పార్టీలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహించింది. రాజకీయ స్వాతంత్య్ర పోరాటం మీద వీటికి ఎలాంటి ఆసక్తీ లేదు.”
దీనిని బట్టి ముస్లిం లీగ్‌, ద్రవిడ పార్టీల లాగే సావర్కర్‌, హిందూ మహాసభలు కూడా బ్రిటిష్‌ వారికి అనుకూలంగానూ, స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగానూ పనిచేశాయని రూఢి అవుతోంది. అయినా పై వ్యాసకర్త ఆ వ్యాసంలో వారిని గూర్చి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం దేనిని సూచిస్తోంది? కాబట్టి దేశభక్తులందరూ నాటి నుండి నేటి వరకు, చరిత్ర ఏదో, పుక్కిటి పురాణం ఏదో, సామ్రాజ్యవాదులకు అనుకూలురైన వారెవరో, వ్యతిరేకులెవరో అర్థం చేసుకొని, విభజన వాదుల నుండి దేశాన్ని కాపాడటంలో తమ వంతు పాత్రను నిర్వర్తించడమే నేటి కర్తవ్యం.
హొసెల్‌ :94903 00449
కె.ఎల్‌. కాంతారావు