– అదనపు కలెక్టర్ పి బెన్ షలోమ్
నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా, వేగంగా జరుగుతున్నాయని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ శాలోమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనితో పాటు అదనంగా గుండాల మండలం వంగాల గ్రామంలో ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 8483 మంది రైతుల నుండి 85,549 మెటిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 35 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతు కల్పించడం జరిగిందని, ప్రతి కేంద్రంలో 25 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, మిల్లర్ల కోసం కొనుగోలు కేంద్రాల దగ్గరలో ఉన్న ఎ.ఎం.సి. గోదాములను తెరవడం జరిగిందన్నారు. వర్షాలు ఇతర అవసరారాల దృష్ట్యా వాటిని స్టాక్ పాయింట్లుగా వినియోగించడం జరుగుతుందని తెలిపారు. బీహారు ఎన్నికల దృష్ట్యా హమాలీల కొరత రాకుండా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఇతర హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ట్రక్ షీట్లను మిల్లుల నుండి కొనుగోలు కేంద్రాలకు వెంటనే పంపాలని హెచ్చరించడం జరిగిందని, తద్వారా ట్యాబ్ ఎంట్రీలు పెరిగాయని, రైతుల పేమెంట్లు పెరిగాయని అన్నారు.
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ విస్తరణాధికారులకు ధాన్యం గ్రేడ్లపై అవగాహన కలిగించడం జరిగిందన్నారు. మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేయవద్దని ట్రేడర్స్ కు హెచ్చరిక చేయడం జరిగందని, ఈ విషయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొన్ని ప్రదేశాలలో వరికోత యంత్రాల కాంట్రాక్టర్ల ఒత్తిడి వలన రైతులు పంట చేతికి రాకముందే ముందే కోసి కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని, తద్వారా తేమ శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. పూర్తిగా వరి గింజ రాదని, ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పుడు పంట కోయాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని, రైతులు త్వరపడి ముందుగా కోయరాదని సూచించారు. ప్రతి మండలంలో ధాన్యం కొనుగోళ్ల సమస్యల పట్ల మండల స్పెషల్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు కొనుగోలు కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతున్నదని తెలియచేస్తూ అలాగే ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు అయినా టోల్ ఫ్రీ నెంబరు 7995120554 ద్వారా తెలపాలన్నారు.