ఊదు కాలది పీరి లేవది

The purple period is the age of Peeriపీరిల పండుగకు దేవుడచ్చి సంగ సంగ ఎగురుతరు. పీరి ఎత్తుకుంటే తన్మయత్వం కమ్మినట్టు ఉంటది. అయితె అట్లా దేవుడు కావాల్నంటే నిప్పుల మీద ఊదు పొగ వెయ్యాలి. ఎర్రని నిప్పుల మీద గుగ్గిలం ఏస్తరు. అయితే కొందరికి దేవుడు రాడు. అప్పుడు ‘ఊదు కాలది పీరి లేవది’ అనే సామెత వాడుతరు. వేరే ఏదైనా పని చేతనై చేయలేకపోయిన వాల్లకు కూడా ఇదే సామెతను ఉపయోగిస్తరు. ఎందుకంటే పని చేతకాని వాల్లను పీరిల మీద పెట్టి అంటుంటరు. ‘ఉబ్బసం నా మొగడు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే’ అని అంటరు. ఉబ్బసం అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాల్లకు దగ్గు, దమ్ము వచ్చి బక్కగ కన్పిస్తరు. ఇసొంటివాల్లు ఏం పని చేస్తరు? చెయ్యలేరు. ఎక్కన్నో గోడ పక్కన కూర్చొని దగ్గుతుంటరు. అటువంటి వాల్ల భార్య మనోగతంగా వున్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అనే నిర్వేద వాక్యం ఇది. అయితే ఈనాటి కాలంలో అన్నిటికి మందులు, చికిత్సలు వున్నయి. మరి కొందరు వుంటరు… వాల్లని ‘నిద్ర మొకం వాల్లు’ అంటరు. ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్లు, ఎవలో ఆయనయి అన్ని తీసికపోయినట్లు కన్పిస్తరు. వీల్లను ‘ఊరు మీద ఊరు పడ్డా ఉలుకడు పలుకడు’ అంటరు. అంటే ఊర్లో సందడిగా వున్నా ఈయన మాత్రం నిదానంగ పైలంగ కన్పిస్తడు. వీల్లను ‘నిమ్మళం మనిషి’ అని కూడా అంటరు. మనిషన్నప్పుడు కొంచమన్న చురుకుదనం ఉండాలి కదా అనుకుంటం. మల్ల ఇసొంటోల్లకు ‘ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు’ అన్నట్టు ఉంటరు. ‘ఉలుకరు పలుకరు’. మాటంటే తప్పు పట్టుకుంటరు. ఒగలను సూస్తే సైసరు, ఓర్వరు. ఈ గుణాలు కలెగస్సి వుంటయి వీల్లకు. ఏది ఏమైన ఇసొంటోల్లకు ఆలోచనలు ఎక్కువ. ఏదో ఒకటి చెప్పుతనే వుంటరు. చెయ్యరు గని చేసేటోల్లకే ఇది ఇట్ల అది అట్ల అని చెప్పుతరు. వీల్లను ‘ఉత్తగున్నోనికి ఊహలెక్కువ’ అంటరు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479