– సహించలేకపోతున్న పాలకులు
– న్యూస్‌క్లిక్‌పై దాడి దానిలో భాగమే
– చైనా ముద్ర కుట్రపూరితం
– ప్రమాదంలో ప్రజాస్వామ్యం : ఎస్వీకే వెబినార్‌లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రశ్న ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు వక్తలు అందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, పాత్రికేయ విలువల్ని కాలరాస్తున్నదనీ, దానిలో భాగంగానే న్యూస్‌క్లిక్‌పై అక్రమ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘భావస్వేచ్ఛపై దాడులు గర్హనీయం’ అంశంపై ఆదివారం వెబినార్ జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, ఓయూ జర్నలిజం రిటైర్డ్ అధ్యాపకులు ప్రొఫెసర్ కే నాగేశ్వర్, ఆంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వక్తలుగా మాట్లాడారు.కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదనీ, అలా కుదరనప్పుడు ఆ సంస్థల్నే పూర్తిగా కొనుగోలు చేస్తున్నారనీ, అదీ సాధ్యం కాకుంటే ‘ఉపా’ చట్టం ప్రయోగించి ప్రశ్నించే మీడియా సంస్థల నోరునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు విశ్లేషించారు. న్యూస్‌క్లిక్ యాజమాన్యం ప్రజాసమస్యలకు బాసటగా నిలిచిందనీ, దానిలో భాగంగానే అభ్యుదయ భావాలున్న ప్రబీర్ పుర్కాయస్థ.. ఢిల్లీ రైతాంగ పోరాటం, ఢిల్లీలో పౌరహక్కులు, కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు, మణిపూర్ హింసలో ప్రభుత్వాల ఉదాశీనత వంటి అంశాలను ఆయన జనబాహూళ్యంలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. దాన్ని సహించలేకే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురిచేస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఒక మీడియా సంస్థపై దాడి కాదనీ, పౌరసమాజంపై పాలకవర్గం చేస్తున్న దాడిగానే చూడాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీబీసీని బెదిరించి, అదుపుచేసే ప్రయత్నం చేశారనీ, ఎన్డీటీవీలోకి దొడ్డితోవలో పెట్టుబడులు పెట్టించి, దాన్ని హస్తగతం చేసుకొని ప్రభుత్వ అనుకూల మీడియాగా మార్చేశారని తెలిపారు. 2018లో పాకిస్తాన్ వ్యతిరేక భావజాలంతో అధికారంలోకి వచ్చారనీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రజాబహుళత్వాన్ని ఏకత్వంలోకి తీసుకెళ్లేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని విశ్లేషించారు. న్యూస్ క్లిక్ చైనా అనుకూల మీడియా అనీ, దేశద్రోహులని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. న్యూస్ క్లిక్ సంపాదకులను అరెస్టు చేసి ఢిల్లీ రైతాంగ పోరాటానికి అనుకూలంగా ఎందుకు వ్యవహరించారనీ, షహీన్‌బాగ్ ఆందోళనల్లో భాగస్వాములైన బాధితుల గాధలు ఎందుకు ప్రచురించారని ప్రశ్నిస్తున్నారనీ, దర్యాప్తు సంస్థల దిగజారుడుతనానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు.
దేశంలో ఒకే గొంతు వినపడాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తున్నాయనీ, భిన్నాభిప్రాయాలు, ప్రశ్నలు ఉండరాదనే ఉద్దేశ్యంతోనే గౌరీలంకేష్ మొదలు ఇప్పటి న్యూస్‌క్లిక్ వరకు మీడియాపై దాడుల్ని కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు. మనుషుల్ని బహుళత్వం నుంచి ఏకత్వంలోకి మార్చే ప్రయత్నం జరుగుతున్నదనీ, దీనితో ‘ప్రశ్న’ను చంపేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. దానిలో భాగంగానే డిజిటల్ మీడియాను కూడా ప్రతికూల శక్తులే ఆక్రమించేశాయన్నారు. మీడియా ద్వారా ప్రశ్నించడాన్ని నేరపూరిత చర్యగా మారుస్తూ, అసలు ఆయా సంస్థల విశ్వసనీయతనే దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్భంధం ప్రజలకు తాకుతుందనే భావన కలిగితేనే మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పత్రికల్లో రాసే వాళ్లను భయపెట్టడమే కాకుండా, ఆ రాతలకు విశ్వసనీయత లేకుండా చేయడమే వారి లక్ష్యమనీ, కాదంటే ‘ఉపా’ చట్టం ప్రయోగిస్తున్నారని చెప్పారు. ఈ చట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిందని ఆక్షేపించారు. ఈ రోజు న్యూస్ క్లిక్‌పై జరిగిన దాడి, రేపు మరో సంస్థపైనా జరుగుతుందనీ, మీడియా పక్షాన నిలవాల్సిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎటు నిలవాలో తేల్చుకోలేని డోలాయమానంలో ఉండిపోవడం దురదృష్టకరమన్నారు. జర్నలిస్టులపై ‘ఉపా’ చట్టం పెట్టినప్పుడు స్పందించాల్సిన స్థాయిలో పాత్రికేయ సమాజం చొరవ చూపట్లేదనీ, ఇలాంటి చర్యలు ప్రభుత్వాలకు మరింత అనుకూలంగా మారుతున్నాయని చెప్పారు. జర్నలిజం వృత్తినే నేరపూరితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు స్వదేశీ శత్రువులనే అధికారపార్టీ వెతుక్కుంటున్నదనీ, అంతర్గత జాతీయతా భావోద్వేగాలు సృష్టించే ప్రయత్నం బలంగా జరుగుతున్నదని చెప్పారు. దానిలో భాగమేమీడియా సంస్థలకు చైనా నుంచి నిధులు వస్తున్నాయనే ప్రచారం అని విశ్లేషించారు. ప్రజలు ఉద్వేగ భావాల దగ్గరే నిలిచిపోయేలా పాలకులు ప్రయత్నిస్తున్నారనీ, దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఏకీకృతం అయితేనే సమాజ మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.