– సైంటిఫిక్ టెంపర్ అజ్ఞానాన్ని పాతరేస్తుంది
– సూడో సైన్స్ సమాజాభివృద్ధికి ఆటంకం
– ప్రజల్లో మూఢత్వాన్ని పెంపొందించటం పాలకుల విధానం
– పాఠ్యాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించటం శోచనీయం
– ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు
– తెలంగాణ బాలోత్సవం వారి ‘నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2024’లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ప్రశ్న’ మానవ ప్రగతికి మూలమని పలువురు వక్తలు వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో ‘నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2024’ కమిటీ ఉపాధ్యక్షులు ఇ.మమత అధ్యక్షతన జరిగింది. ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ చైర్మెన్ డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ పిల్లలో నిరంతరం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలన్నారు. ప్రశ్నించటమే కాదు..సమాధానాన్ని రాబట్టాలని సూచించారు. సత్యాన్ని శోధించటం అలవాటు చేసుకోవాలన్నారు. డాల్డాలాంటి హాని కరమైన ఆయిల్‌ను ప్రపంచం మొత్తం నిషేధించినా ఇక్కడ ఎక్కువ మంది వాడుతున్నారని తెలిపారు. వైద్య రంగంలో ఆరోగ్యానికి హాని చేసే మందులు ఎన్నో ఉన్నాయనీ, వాటిని నిషేధించినా..యథేచ్ఛగా అమ్మకం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారమంతా బహుళ జాతి కంపెనీల లాభాలే లక్ష్యంగా సాగుతున్నదని వివరించారు. సమాజ అభివృద్ధికి సైన్సు దోహద పడుతున్నదని తెలిపారు. సైంటిఫిక్ టెంపర్ అజ్ఞానాన్ని పాతరేస్తదన్నారు. సూడో సైన్స్ సమాజ పురోగమనానికి ఆటంకంగా మారుతున్నదనీ, ప్రజలను అంధకారంలోకి నెట్టి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. శాస్త్రీయ ఆలోచనా లక్ష్యంతో పిల్లల్లో సైన్స్ అవగాహన కల్పించి, మూఢనమ్మకాలను పారదోలాలని పిలుపునిచ్చారు.
సైంటిస్టు రాధిక మాట్లాడుతూ పిల్లల్లో సైన్స్ విజ్ఞానం అందించటం అవసరమన్నారు. ఆయా అంశాలపట్ల చేస్తున్న పరిశోధనలకు పేటెంట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయన్నారు.
కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ మనిషిని మహౌన్నతుడుగా మార్చేది సైన్స్ విప్లవమేనని చెప్పారు. ప్రజల జీవితాన్ని సుఖమయం చేసేది టెక్నాలజీ అన్నారు.సైన్స్ ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఏదైనా రుజువైతేనే నమ్మాలన్నారు. అజ్ఞానాన్ని వర్ణిస్తూ కథలు చెబుతారని వివరిం చారు. సైన్స్ ఉపాధ్యాయులు పిల్లల్లో శాస్త్రీయ జ్ఞానాన్ని నింపాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సూడో సైన్స్ ముందుకు పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ సమయంలో సైన్స్ పండుగలు ఎక్కువగా జరపాలని సూచించారు. పుక్కిటి పురాణాలతో ప్రజల ఆలోచనలను తిరోగమనం వైపుకు పాలకులు మళ్లిస్తున్నారని విమర్శించారు. సైన్సును ప్రజల సమస్యలకు జోడించి వారి జీవితాన్ని సుఖమయం చేసినప్పుడే సాంకేతికతకు అర్థమని చెప్పారు.
విజ్ఞాన దర్శిని అధ్యక్షులు టి రమేష్ మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఇండియన్ సైయింట్‌ఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సైన్స్ పురోగమనానికి తోడ్పడ్డారని తెలిపారు. దశాబ్ద కాలంగా సైన్స్ పరిశోధనల సంఖ్యలోనూ, నాణ్యత లోనూ,అంతర్జాతీయంగా వెనుకబడి ఉన్నామని చెప్పారు.కొన్ని అంశాల్లో గణనీయ ప్రగతి సాధించినా..అనేక అంశాల్లో వెనుకబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులే పనిగట్టుకుని మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారని విమర్శించారు. సూడో సైన్స్‌ను ప్రొత్సహిస్తూ, దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ పరిశోదనా రంగాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నారని చెప్పారు. పాఠ్య ప్రణాళిక నుంచి రసాయనక శాస్త్రానికి పునాది అయిన పిరియాడిక్ టెబుల్ సృష్టి సిద్ధాంతాన్ని తోసి వేస్తూ, డార్విన్ ప్రతిపాధించిన జీవ పరిణామా సిద్ధాంతాన్ని తొలగించాలని ప్రయత్నించటం దారుణ మన్నారు. సైన్స్ అంతిమ లక్ష్యం ప్రజలకు విజ్ఞానాన్ని అందించడమే నన్నారు. శాస్త్రవేత్త దర్మేందర్‌రావు మాట్లాడుతూ సైన్స్ అంటే ఒక కార్యాకారణ సంబంధమన్నారు. అది నిరూపణకు నిలబడుతుందన్నారు. ప్రకృతిలో ప్రతిది సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ బాలోత్సవ ప్రధాన కార్యదర్శి ఎన్ సోమయ్య మాట్లాడుతూ అజ్ఞానం రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బాలోత్సవం విజ్ఞానానికి పునాదులు వేస్తున్నదని చెప్పారు.
ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన..
పలు పాఠశాలలనుంచి వచ్చిన విధ్యార్థులు వివిధ అంశాలపై వైజ్ఞానిక ప్రదర్శనను రూపొందించారు.వారు రూపొందించిన పలు ఆవిష్క రణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి.ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం వైజ్ఞానికి ప్రదర్శనలలో విజేతలైన వారికి బహు మతులు అందజేశారు.కార్యక్రమంలో జేవీపీ అధ్యక్షులు కోయ వెంకటేశ్వర్లు, తెలంగాణ బాలోత్సవం అద్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ఉపాద్యక్షురాలు కె సుజావతి, రూపరుక్మిణీ, జి బుచ్చిరెడ్డి, సీవీ హరికృష, శాంతారావు తదితరులు పాల్గొన్నారు.