ప్రశ్నించే గొంతు పార్లమెంటులో ఉండాలి

ప్రశ్నించే గొంతు పార్లమెంటులో ఉండాలి– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న మోడీ
– మతోన్మాద బీజేపీని గద్దె దించాలి
– కార్మిక, రైతాంగ సమస్యలపై పోరాడేది సీపీఐ(ఎం)
– భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలి : సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
నవతెలంగాణ-కొమురవెల్లి
రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించే గొంతు పార్లమెంటులో ఉండాలని, అందుకు సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో వుల్లంపల్లి సాయిలు అధ్యక్షతన జరిగిన పార్టీ శాఖ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందుత్వం పేరుతో పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధంగా మోడీ విధానాలున్నాయని వివరించారు. గడిచిన పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల, రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించిందని తెలిపారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం)ని పార్లమెంట్‌కు పంపితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా బడుగు బలహీన, కార్మిక, రైతాంగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి, అత్తిని శారద, మాజీ సర్పంచ్‌ తాడూరి రవీందర్‌, మండల నాయకులు తేలు ఇస్తారి, వుల్లంపల్లి నరసవ్వ, కానుగుల రాజు, సున్నం యాదగిరి, దయ్యాల పోశయ్య, కర్రోళ్ల ఎల్లయ్య, దండు రవి, తేలు నవనీత, మంజుల, కనుకవ్వ, లింగవ్వ, ఇందిరా, బీడీ, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.