ప్రశ్నించే గొంతు పార్లమెంట్‌లో ఉండాలి

ప్రశ్నించే గొంతు పార్లమెంట్‌లో ఉండాలి– రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేలా మోడీ విధానాలు
– సీపీఐ(ఎం) భువనగిరి అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలి : పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించే గొంతు పార్లమెంట్‌లో ఉండాలని, భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మున్సిపల్‌ కమిటీ సమావేశం ఎమ్‌డీ పాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పదేండ్ల మోడీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారన్నారు. ధరల మీద ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక, రైతాంగ సమస్యలు పట్టించుకోకుండా పాలన సాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగంపై నల్ల చట్టాలు తీసుకువచ్చి వందలాది మంది రైతుల చావులకు బీజేపీ కారణమైందన్నారు. ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. బీజేపీలో ఉంటే నీతిమంతులు, లేకపోతే అవినీతిపరులా అని ప్రశ్నించారు. దేశంలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమచేస్తానని చెప్పిన మోడీ.. ఒక్క రూపాయి కూడా జమచేయలేదని గుర్తుచేశారు. ప్రజలపై పన్నుల భారం మోపడం, దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. మతోన్మాదం పేరుతో దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలిపారు. మతవిధ్వేషాలు రెచ్చగొడుతూ హిందుత్వం పేరుతో పబ్బం గడుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసంచేసే విధంగా మోడీ విధానాలు ఉన్నాయన్నారు. భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎమ్‌డీ.జహంగీర్‌ను గెలిపించేందుకు ప్రతికార్యకర్తా సైనికునిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ మున్సిపల్‌ కార్యదర్శి బండారు నర్సింహ, జిల్లాకమిటీ సభ్యులు అవ్వారు రామేశ్వరి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ గోపగోని లక్ష్మణ్‌, కౌన్సిలర్‌ దండ హిమబిందు అరుణ్‌కుమార్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, నాయకులు బత్తుల దాసు, ఉష్కాగుల శ్రీనివాస్‌, గోశిక కర్నాకర్‌, బొడ్డు రాజుగౌడ్‌, నెల్లికంటి నర్సింహ, బొమ్మకంటి కృష్ణ, బాతరాజు దశరథ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.