రేసు రసవత్తరం

రేసు రసవత్తరం– రేసులో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్స్‌
– ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌ 2024
టోరంటో (యుఎస్‌ఏ) : ప్రతిష్టాత్మక ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో టైటిల్‌ రేసులో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్స్‌ నిలిచారు. అందులో భారత గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌ ముందు వరుసలో ఉన్నారు. 12 రౌండ్ల పోటీల అనంతరం డి. గుకేశ్‌, ఐయాన్‌ (రష్యా), హికారు నకమురు (యుఎస్‌ఏ)లు 7.5 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. టోర్నమెంట్‌ ఫేవరేట్‌ ఫాబియానో కారౌనా 7.0 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి ఆశలు నిలుపుకున్నాడు. రెండు రోజుల్లో చివరి రెండు రౌండ్ల మ్యాచ్‌లు ఉండనున్నాయి. గుకేశ్‌ తొలుత తెల్లపావులతో అలెరాజతో పోటీపడనుండగా.. హికారు నకమురతో నల్లపావులతో ఆడాల్సి ఉంటుంది. 2013 ఫిడె క్యాండిడేట్స్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఉత్కంఠ రేపిన టోర్నీ ఇదే కావటం విశేషం. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన గ్రాండ్‌మాస్టర్‌..ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో డింగ్‌ లైరెన్‌ (చైనా)తో పోటీపడేందుకు అర్హత సాధించనున్నాడు.