– వాగు దాటే క్రమంలో ఎద్దు మృతి
– అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటి రాలేక జనాల అవస్థలు
– ఉధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు, కిన్నెరసాని వాగులు
– అలుగు పోసుకున్న కుంటలు, చెరువులు..
– చేనుల్లో నిలిచిన వరద నీరు
– కిన్నెరసాని వరద ఉధృతిని పరిశీలించిన సీఐ, ఎస్సై
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
బుధవారం మొదలైన వర్షాలు తెరపివ్వకుండా ఆదివారం వరకు మండలంలో విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఆగి ఆగి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో కుంటలు, చెరువులు అలుగు పోసుకున్నాయి. 5 రోజులుగా ఏకబిగిన వర్షాలకు కిన్నెరసాని, జల్లేరు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి అనంతోగు గ్రామానికి చెందిన గొగ్గెల సమ్మయ్య అనే రైతు దుక్కిటెద్దు కిన్నెరసాని వాగు దాటే క్రమంలో మృతి చెందింది. అదేవిధంగా జల్లేరు ఆవల ఉన్న చంద్రాపురం గ్రామానికి చెందిన గొగ్గెల లత అనే వివాహిత పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు జల్లేరు వాగు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆమెను తీసుకుని దాటలేక పోయారు. అవస్థలు పడుతూ మరో మార్గం గుండా చుట్టూ తిరిగి ఆలస్యంగా ఆళ్ళపల్లి ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ నుండి కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆదివారం లత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రాపురంతో పాటు దొంగతోగు, అడవిరామవరం, బోడాయికుంట, సీతానగరం, చంద్రాపురం, రాయిగూడెం, తదితర గ్రామాలు జల్లేరు, కిన్నెరసాని, కోడెల వాగులలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి మండలం నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళే ప్రయాణికులు రాకపోకలు సాగించే క్రమంలో లో-లెవల్ కల్వర్టుల వద్ద నానా అగచాట్లు పడుతున్నారు.
కాగా.. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆళ్ళపల్లి మండలంలో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వివిధ పంట చేనుల్లో వరద నీరు చేరి పంట నష్టం వాటిల్లుతుందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిన్నెరసాని, జల్లేరు, తదితర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆవల ఉన్న చేన్లకు రైతులు వెళ్లలేక చేన్ల పని మాని ఇంటి పట్టున ఉంటున్నారు. స్థానిక అధికారులు దాటొద్దని వంతెనలు లేని గ్రామాల్లో కొందరు సాహసం చేసి జల్లేరు, కిన్నెరసాని వాగులు దాటుతూనే ఉన్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మర్కోడు, తదితర గ్రామాల్లో అంతర్గత గ్రావెల్ రోడ్లు పూర్తిగా బురదమయం అయ్యాయి. దీంతో స్థానికులు రోడ్డెక్కి అవస్థలు చెప్పుకుంటున్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలు టి.సురేష్, ఈ.రతీష్ తమ సిబ్బందితో పాటు స్వయంగా రాయిపాడు సమీపంలో కిన్నెరసాని వాగు ఉధృతి, వొర్రెల ప్రవాహం పరిశీలించారు. జలదిగ్బంధంలో ఉన్న గ్రామ ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తున్నారు.