విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఆర్‌సిఓను సస్పెండ్‌ చేయాలి

– పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
– డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో వైరా సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులం ఎదుట ధర్నా
నవతెలంగాణ-వైరాటౌన్‌
వైరా టిఎస్‌డబ్ల్యుఆర్‌యస్‌ గురుకుల విద్యాలయంను ఆర్‌సిఓ పర్యవేక్షణ చేయకుండా, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఫలితంగా అడవిని తలపిస్తుందని, వెంటనే సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ (ఆర్‌.సి.ఓ)ను సస్పెండ్‌ చేయాలని, పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డివైయఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోట ప్రేమ్‌ కుమార్‌, ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో వైరా టియస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ గురుకుల విద్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యాలయంలో పర్యటించి విద్యార్థినిలు, ప్రిన్సిపల్‌, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులంలో చెట్లు, పిచ్చి మొక్కలు, వయ్యారి భామ మొక్కలు విపరీతంగా పెరిగాయని, చెత్త, చెదారం పేరుకుపోయి ఉందని, ఫలితంగా విష పాములు, పురుగులు, తేళ్ళు సంచరిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఆర్‌సిఓ ప్రత్యూష కనీసం ఆ గురుకులంను ఇంతవరకు సందర్శించలేదని, సందర్శించినట్లు విజిటర్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చూపించమని అడిగితే సిబ్బంది ఎవరూ స్పందించడం లేదని వారు తెలిపారు. నెలకి ఒకసారి గురుకుల హాస్టల్స్‌ ను సందర్శించాలని నిబంధనలు ఉన్నా ఆర్‌సిఓ మాత్రం ఏదో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరై వెళ్ళిపోతున్నారని, విద్యార్ధినీలతో మాట్లాడకుండా, సమస్యలు తెలుసుకోకుండా హడావుడిగా వెళ్ళిపోతున్నారని అన్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు అన్ని సమస్యలకూ నిలయాలుగా మారాయని, గతంలో వివిధ కారణాలతో కుడా విద్యార్థులు చనిపోయారని అన్నారు. వైరా టియస్‌డబ్ల్యుఆర్‌యస్‌ గురుకుల విద్యాలయంలో ఆర్‌సిఓ పర్యవేక్షణ చేయకుండా విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఫలితంగా అడవిని తలపిస్తుందని వెంటనే జిల్లా కలెక్టర్‌, ఉన్నత అధికారులు స్పందించి సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ (ఆర్‌.సి.ఓ)ను సస్పెండ్‌ చేయాలని, పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్‌లో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ నాయకురాలు భూక్యా విజయభారు, డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు చిత్తారుమురళి, ఎస్‌ఎఫ్‌ఐ, డివైయఫ్‌ఐ పట్టణ నాయకులు విక్రంత్‌, వెంకటేష్‌, సాయి, కమల్‌, మనోహర్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.