నవతెలంగాణ – కంఠేశ్వర్
వైన్స్ షాపుల పక్కనే పర్మిట్ రూంలకు పర్మిషన్ ఇచ్చి ఓపెన్ బార్లుగా మార్చి బహుజన శ్రామిక ప్రజలను శాశ్వతంగా మద్యానికి బానిసలుగా మార్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా కనిపించడంలేదని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత విమర్శించారు. ఈ మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా 6 సంవత్సరాల పాప నుండి అరవై సంవత్సరాల అవ్వపై జారుతున్న అత్యాచారాలు, హత్యలకు కారణం విచ్చలవిడి మధ్యం వ్యాపారమే ప్రధాన కారణమని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టి ఎన్జీవో భవన్ లో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సులో అమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా మధ్యం ఏరులై పారుతుందన్నారు.ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ప్రకారం బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బెల్ట్ షాపులు, వైన్స్ షాపుల పక్కనే పర్మిట్ రూంలు ఓపెన్ బార్లుగా విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మద్యానికి బానిసై విచక్షణ జ్ఞానం కోల్పోయి మధ్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగడం చూస్తే ఆందోళన కలుగుతుందన్నారు.మహిళలపై అఘాయిత్యాలకు, రోడ్డు ప్రమాదాలకు తొంబై శాతం మధ్యం సేవించి వాహనాలు నడిపే వారి వల్లనే జరుగుతున్నట్లు పోలీసులే స్వయంగా ప్రకటిస్తున్నారని ఆమె చెప్పారు. వైన్స్ షాపుల పక్కనే ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలను నియంత్రించాలని, జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపులన మూసివేయాలని మహిళాలోకం ఉద్యమించాలని సబ్బని లత పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎ.కె. లతా, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశబాయి,బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు స్వాతి, నగర నాయకులు జీజాబాయి, శాంతబాయి, రాధా, సోనీ తదితరులు పాల్గొన్నారు.