– పీసీసీఎఫ్ డొబ్రియాల్ వెల్లడి
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో వరుసగా రెండో పులి మృత్యువాతపడటంతో అటవీ శాఖాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పులి మృత్యువాత పడిన ప్రాంతాన్ని మంగళవారం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియాల్, అడిషనల్ పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) పర్గయిన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతినిధి ఇమ్రాన్ పరిశీలించారు. అనంతరం పీసీసీఎఫ్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మృత్యువాతపడిన పులి ఎస్-9గా గుర్తించామని, దీని వయస్సు ఐదేండ్లు ఉంటుందని తెలిపారు. దీని మెడకు వైరు ఉందని, కానీ దాని వల్లే చనిపోయిందని నిర్ధారించలేమని చెప్పారు. పులిపై విష ప్రయోగం జరిగినట్టు కూడా అనుమానాలు ఉన్నందున.. పులి కళేబరం నుంచి శాంపిళ్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. దీనికి ముందు పులి హతమార్చిన ఆవు నుంచి కూడా శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు. కొన్ని రోజుల కిందట పులి హతమార్చిన ఆవుపై విషం చల్లడంతో దాన్ని తిని మృత్యువాతపడి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి నిర్ధారణ జరుగుతుందన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పులుల సంచారం ఎక్కువగా ఉందని, తిప్పేశ్వర్, కవ్వాల్, తాడోబా అభయారణ్యం నుంచి ఇక్కడికి పులుల రాకపోకలు అధికంగా ఉన్నట్టు తెలిపారు. 4, 5 సంవత్సరాల నుంచి ఎస్-9 మగ పులితో పాటు ఎస్-6 ఆడ పులి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని, వీటికి రెండేండ్ల కిందట నాలుగు పిల్లలు జన్మించినట్టు తెలిపారు. ఇందులో రెండ్రోజుల కిందట ఒక పులి పిల్ల కళేబరాన్ని గుర్తించగా, ఇప్పుడు చనిపోయింది ఎస్-9 మగ పులిగా గుర్తించినట్టు చెప్పారు. ఇంకా ఎస్-6 ఆడపులితో పాటు మూడు పిల్లలు ఉన్నాయన్నారు. ఈ పర్యటనలో వారి వెంట జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, కాగజ్‌నగర్ ఎఫ్డీఓ వేణుబాబు ఉన్నారు.